సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్.. ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విద్యార్థుల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు, కాళేశ్వరం, ఐటీ ఉద్యోగాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు.

3 ఆగస్టు, 2026 5:25 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్.. ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విద్యార్థుల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విమర్శల యుద్ధం మరోసారి ముదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన కేటీఆర్.. ఇంజనీరింగ్ విద్యార్థులను విమర్శించే ముందు సీఎం తన జీవితంలో ఒక్క పోటీ పరీక్షైనా రాశారా? ఒక్క ఇంటర్వ్యూకైనా హాజరయ్యారా? అంటూ ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న తెలంగాణ ఇంజనీర్లను అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్‌లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ నెలకొందని, ఎన్నోఏళ్లగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసిన కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణలో యువత ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించడం లేదని విమర్శించారు. రాహుల్‌కు, రేవంత్‌కు విద్యార్థుల ముందుకొచ్చి మాట్లాడే దమ్ములేదు అని, ఇతర రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే రాహుల్ పరిగెత్తుకొని పోతాడని, కానీ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే మాత్రం రాహుల్ గాంధీ రాడని కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగుల తరఫున రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నామని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందేనని, నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఐటీ రంగం కూడా కాంగ్రెస్ పాలనలో దెబ్బతిందని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు ఏడు వేల ఐటీ ఉద్యోగాలు కోల్పోయాయని పేర్కొంటూ, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖగా మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపైనా కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూలై నెల అంతా గోదావరిలో నీళ్లు పోతున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, నీళ్లు ఎత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్, క్రిమినల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదేనని కేటీఆర్ దుయ్యబట్టారు. గోదావరి నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అసలు కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్‌కు అవగాహన ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని రైతులకు అర్థమైందని అన్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి తరలిస్తున్న నీరు కూడా కాళేశ్వరం పంప్ హౌస్‌ల ద్వారానే వస్తోందని గుర్తు చేశారు.

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం వెనుక అవినీతి ఉందని ఆరోపించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి చేసే ప్రతి స్కీమ్ వెనక.. పక్కా ఒక స్కామ్ ఉంటదని, మెట్రోను ఎందుకు టేకోవర్ చేశాడు? 280 ఎకరాలు కొట్టేయడానికి రేవంత్, ఆయన సోదరులు స్కెచ్ వేశారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తాతా మ‌ధు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు