కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. జడ్జితో విచారణ జరిపించండి

కేసీఆర్ కుటుంబ భూములపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను 1,000 ఎకరాలుగా పేర్కొన్న రేవంత్.. ఇప్పుడు కేసీఆర్ దంపతులకు 67.13 ఎకరాలు ఉన్నట్లు సభలో చెప్పడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. తమ ఆస్తులపై, ప్రభుత్వ పెద్దల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఇదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

17 సెప్టెంబర్, 2026 12:42 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. జడ్జితో విచారణ జరిపించండి

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): కేసీఆర్ కుటుంబానికి చెందిన భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన భూముల వివరాలు, ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు.

కేసీఆర్, ఆయన సతీమణి శోభకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, మిట్టపల్లి, శివార్ వెంకటాపూర్ ప్రాంతాల్లో కలిపి 67.13 ఎకరాల భూమి ఉందని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే కేటీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై కూడా భూముల వివరాలను సభలో ప్రస్తావించారు.

1000 ఎకరాలు అన్నావు.. ఇప్పుడు 67 ఎకరాలంటున్నావ్

ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ 1,000 ఎకరాలంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ‘మైసూర్ బోండాలో ఎంత మైసూర్ ఉంటదో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో అంతే నిజం ఉంది’ అంటూ రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తన భూముల వివరాలను వెల్లడించారని, చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఆస్తులపై విచారణ జరిపించండి.. కేటీఆర్ సవాల్

తమ ఆస్తులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపైనా విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తే తమ భూముల్లో ఏదైనా తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. ఈ సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని కోరారు.

కేసీఆర్ రైతు.. వ్యవసాయం చేస్తూనే ఉన్నారు

కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని కేటీఆర్ అన్నారు. వ్యవసాయంపై మక్కువతో ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. చింతమడకలో తమ కుటుంబానికి చెందిన భూమిలో రెండు ఎకరాలను ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్‌కు గతం నుంచే భూములు ఉన్నాయని, ఇటీవలే వాటిని సంపాదించుకున్నారనే ఆరోపణలు సరికావని ఆయన అన్నారు.

ప్రగతి భవన్ వ్యాఖ్యలపైనా కేటీఆర్ విమర్శలు

రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రగతి భవన్‌లో 150 బెడ్‌రూమ్‌లు, బంగారు బాత్రూంలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యల్లో ఎంత వాస్తవం ఉందో, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ భూములపై చేస్తున్న ఆరోపణల్లో కూడా అంతే వాస్తవం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే దళితులపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళిత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంపై గతంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశాలు

మరోవైపు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా, భూముల యాజమాన్య హక్కులు ఏమిటన్నది పరిశీలించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

రేవంత్ రెడ్డి ప్రకారం, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారంపై విచారణ జరిపి, ప్రభుత్వ భూములు ఉన్నట్లు తేలితే వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకుంటారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ, తమ భూముల వివరాలు ఎన్నికల అఫిడవిట్లలోనే వెల్లడించామని చెబుతున్నారు.

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కేటీఆర్ సందేశం

ఇదిలా ఉండగా జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమై, తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, సమైక్యత కోసం కృషి చేయాలని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు