హైదరాబాద్, అక్టోబర్ 1 (జనవాణి): సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన హోటల్ వ్యాపారం, కుటుంబ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇరు కుటుంబాల ఆస్తులపై నిష్పక్షపాత విచారణకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
‘నా హోటళ్లకు ఉచిత ప్రచారం’
సిరిసిల్లలో తన హోటళ్ల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించడంపై కేటీఆర్ స్పందిస్తూ తన హోటళ్లకు ఉచిత ప్రచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. తాను అమెరికాలో ఆరేళ్లపాటు ఉద్యోగం చేసి, అక్కడ సంపాదించిన డబ్బుతో భారత్‌కు తిరిగి వచ్చి 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. మొదట ఒక హోటల్‌తో ప్రారంభమైన వ్యాపారం ప్రస్తుతం మూడు హోటళ్లకు విస్తరించిందని తెలిపారు. తన వ్యాపార వివరాలను ఎన్నికల అఫిడవిట్లలోనే వెల్లడించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే హోటళ్ల సంఖ్యను మరింత పెంచుకునేవాడినని వ్యాఖ్యానించారు. వ్యాపారం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.
ఇరు కుటుంబాల ఆస్తులపై విచారణకు సవాల్
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ కీలక సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబంతో పాటు రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులపై కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. విచారణలో తమ కుటుంబం తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలకు, శిక్షకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా సీఎం కుటుంబ ఆస్తులపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విచారణకు ప్రభుత్వం అంగీకరిస్తే పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.
చేనేత సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదు?
సిరిసిల్ల పర్యటనలో చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సమస్యలపై సీఎం దృష్టి పెట్టాల్సి ఉండగా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికుల సమస్యలపై తాము నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతున్నామని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమ కుటుంబ ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపైనా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ విమర్శలు చేయడానికి ఇంత భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.




















