హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనవాణి): బీజేపీతో పొత్తుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్’లో పాల్గొన్న కేటీఆర్ బీఆర్‌ఎస్ రాజకీయ వైఖరిపై స్పష్టత ఇచ్చారు.
2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. గత 26 ఏళ్లలో బీజేపీతో ఒక్కసారి కూడా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్‌ఎస్ బీజేపీకి వ్యతిరేకమని పేర్కొంటూ అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘RRR – Recall, Regret, Revolt’ పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటిలో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రజలు తమ నిర్ణయాన్ని పునరాలోచించే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ప్రజల్లో అసంతృప్తి క్రమంగా ఆగ్రహంగా మారుతోందని, ‘Regret’ నుంచి ‘Revolt’ దిశగా మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ నాయకత్వానికి విధేయుడిగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.




















