హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనవాణి): అడవిని నరికే వీరప్పన్‌ను అటవీ శాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే అట్లనే ఉందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని భూములను హారతి కర్పూరంలా కాజేస్తున్నారని ఆరోపించారు. ‘తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు’ అన్నట్లుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘కొండల్, తొండల్, అనకొండల్’ అన్నట్లుగా కొండల్ రెడ్డి, తొండల్ రెడ్డి రాష్ట్రంపై విరుచుకుపడి దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ప్రతి స్కీమ్ వెనుక స్కామ్
ముఖ్యమంత్రి రాకముందు ఆర్టీఐని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి బతికేవారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో బ్లాక్‌మెయిల్, భూదందాలు కొనసాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తన అనుయాయులు, అన్నదమ్ములకు భూములు కట్టబెట్టి లక్షల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి స్కీమ్ వెనుక పక్కాగా ఒక స్కామ్ ఉంటుందని కేటీఆర్ అన్నారు.
‘సమాంతర రెవెన్యూ వ్యవస్థ’
రాష్ట్రంలో చీకట్లో ఓ సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. దళితులు, గిరిజనులకు చెందిన అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని అన్నారు. లగచర్లలో తమ అల్లుడి కోసం గిరిజన భూములను గుంజుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 22ఏ కింద సుమారు 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల విస్తీర్ణం కోటి 16 లక్షల ఎకరాలకు పెరిగిందని కేటీఆర్ విమర్శించారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
మూసీ, ఫ్యూచర్ సిటీ భూములపైనా ఆరోపణలు
అత్త సొమ్మును అల్లుడికి దానం చేసినట్లుగా నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూములను అప్పగిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల ఎకరాల భూములను అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్ల విలువైన భూములను కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు.
రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మెడ పట్టి బయటకు పంపించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బాగోతాలు బయటపడతాయనే భయంతోనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ల్యాండ్ చోరీ విపరీతంగా జరుగుతోందని, ‘ఇందిరమ్మ రాజ్యం’ పేరుతో భూములను దోచుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిన భూములన్నింటినీ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.




















