కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?: రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ యువభేరి సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. యువతకు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు లేవని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

5 సెప్టెంబర్, 2026 1:37 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?: రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

కరీంనగర్, సెప్టెంబర్ 5 (జనవాణి): సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన, యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధించారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన యువభేరి సభలో కేటీఆర్ ప్రసంగించారు.

యువతకు స్కిల్ లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని గడగడలాడించిన తెలంగాణ యువత ముందు ఆయన ఓ లెక్క కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జాబులు లేవు.. నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదన్నారు.

కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించిన కేటీఆర్.. తెలంగాణను సాధించిన కేసీఆర్ రాజీనామా చేయాలా? ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ '420 మోసాలకు 420 సార్లు రేవంత్ రాజీనామా చేయాలి' అని డిమాండ్ చేశారు. కేసీఆర్‌తో పెట్టుకోవద్దని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా, ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు ముందున్నాయని వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని ఆరోపించారు.

ఉద్యోగాల అంశంపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రోజుల్లో కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. తమ పదేళ్ల పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్‌తో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు