న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనవాణి): తెలంగాణలోని పేద, నిరుపేద గ్రామీణ కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్రానికి 11.56 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీ డాక్టర్ మల్లు రవి, తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు తెలంగాణ ఎంపీలతో కలిసి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బుధవారం కలిశారు. తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇళ్లను రాష్ట్రానికి కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీన వర్గాలకు చెందిన అనేక కుటుంబాలకు ఇప్పటికీ సొంత ఇళ్లు అవసరమని ఎంపీ మల్లు రవి, ప్రతినిధి బృందం కేంద్ర మంత్రికి వివరించింది. రాష్ట్రంలోని గ్రామీణ పేదల గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. PMAY-G కింద ఇళ్ల కేటాయింపును త్వరితగతిన చేపట్టి రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కోరిన 11.56 లక్షల ఇళ్ల ప్రతిపాదనకు త్వరగా ఆమోదం తెలిపి నిధులు, ఇళ్ల కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రతినిధి బృందం కోరింది. గ్రామీణ పేద కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ అంశంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్రానికి 11.56 లక్షల PMAY-G ఇళ్ల కేటాయింపు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.





















