రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

30 జులై, 2026 10:45 PM•ByRalin

Share this article

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ఫైల్ ఫొటో)

హైదరాబాద్, జూలై 30: ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

గురువారం డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రెవెన్యూ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, రాబోయే రెండు రోజుల వర్షాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ట్రాఫిక్, విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో కలిసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో నాలుగు రోజుల క్రితం వరకు సుమారు 30 శాతం ఉన్న వర్షపాతం లోటు, గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో దాదాపు భర్తీ అయి సాధారణ స్థాయికి చేరుకుందని మంత్రి తెలిపారు.

పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జూలై 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వెల్లడించారు. రానున్న రెండు రోజులు ఆయా జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు