హైదరాబాద్, ఆగస్టు 5: సైదాబాద్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న స్టీల్ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రి అజారుద్దీన్‌తో కలిసి హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు సుమారు రూ.680 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయని తెలిపారు. చంచల్‌గూడ జైలు నుంచి ఒవైసీ ఆసుపత్రి వరకు, మరోవైపు చంపాపేటకు అనుసంధానంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఈ బ్రిడ్జిని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సంతోష్‌నగర్, చంచల్‌గూడ, సైదాబాద్ ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని కూడా త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఈ బ్రిడ్జిలకు అనుసంధానంగా అవసరమైన అప్రోచ్ రోడ్ల విస్తరణ పనులు కూడా చేపడతామని చెప్పారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పెండింగ్‌లో ఉన్న వంతెనల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని మంత్రి తెలిపారు. అలాగే కేబీఆర్ పార్కు సమీపంలో చేపట్టిన బ్రిడ్జి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.





















