కూలీ పనిచేస్తూ పీహెచ్‌డీ సాధించాడు.. పేదరికాన్ని జయించిన నల్లగొండ యువకుడి సక్సెస్ స్టోరీ!

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు నల్లగొండ జిల్లాకు చెందిన వలిగొండ నరసింహ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో కూలీ, మేస్త్రీ పనులు చేస్తూనే చదువును కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి.. డాక్ట‌రేట్ అందుకున్న స్థానానికి ఎదిగారు.

12 సెప్టెంబర్, 2026 1:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కూలీ పనిచేస్తూ పీహెచ్‌డీ సాధించాడు.. పేదరికాన్ని జయించిన నల్లగొండ యువకుడి సక్సెస్ స్టోరీ!

పేదరికాన్ని జయించి పీహెచ్‌డీ సాధించిన నల్లగొండ యువకుడు వలిగొండ నరసింహ (Social Media Image)

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనవాణి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన వలిగొండ నరసింహది సాధారణ కుటుంబ నేపథ్యం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ చదువుపై ఉన్న ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఒకవైపు చదువు.. మరోవైపు కుటుంబాన్ని ఆదుకునేందుకు కూలీ, మేస్త్రీ పనులు చేస్తూ ముందుకు సాగారు.

నరసింహ పాఠశాల విద్య పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సాగింది. కోతులాపురం ప్రాథమిక పాఠశాల, ఏపూరు పాఠశాల, తంగడపల్లి పాఠశాల, గుండ్రాంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తర్వాత చౌటుప్పల్‌లోని మాతృశ్రీ జూనియర్ కళాశాలలో బైపీసీ విభాగంలో ఇంటర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి దూర విద్యా కేంద్రం ద్వారా బీఏ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

కూలీ, మేస్త్రీ పనులు చేస్తూనే ఉన్నత విద్య

చదువుకోవాలనే తపన ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో జీవనోపాధి కోసం నరసింహ కూలీ, మేస్త్రీ పనులు చేయాల్సి వచ్చింది. అయితే ఆ కష్టాలు ఆయన లక్ష్యానికి అడ్డుగా మారలేదు. పనులు చేస్తూనే చదువును కొనసాగించారు. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నత విద్య వైపు అడుగులు వేశారు.

విద్యార్థి ఉద్యమాల నుంచి పరిశోధన వరకు

ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన తర్వాత నరసింహ విద్యార్థి ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా దళిత, బహుజన విద్యార్థుల సమస్యలపై జరిగే ఉద్యమాల్లో భాగస్వామ్యమయ్యారు. అదే సమయంలో అకడమిక్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. యూజీసీ-నెట్, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS-SET)లో అర్హత సాధించి పరిశోధన వైపు అడుగులు వేశారు. ఓయూ పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టర్ ఎం. రమణ పర్యవేక్షణలో ‘డిమాండ్ ఫర్ స్టేట్ ఆటానమీ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్: ఏ స్పెషల్ స్టడీ ఆన్ తమిళనాడు స్టేట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం వచ్చిన డిమాండ్లు, అవి దేశ ఫెడరల్ వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఈ పరిశోధనకు గుర్తింపుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు పీహెచ్‌డీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

మేస్త్రీ నుంచి ఓయూ డాక్టరేట్ వరకు.. వలిగొండ నరసింహ సక్సెస్ స్టోరీ

85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్

ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవం నరసింహ జీవితంలో మరుపురాని ఘట్టంగా నిలిచింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా, ఓయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం చేతుల మీదుగా నరసింహ పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

తన విజయాన్ని తండ్రి దివంగత వలిగొండ మారయ్యకు అంకితం చేశారు. తన చదువు, ఎదుగుదలకు తండ్రి అందించిన ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

యువతకు స్ఫూర్తిగా నరసింహ ప్రయాణం

ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న నరసింహకు డాక్టరేట్ లభించడంపై ఏపూరు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, దళిత-బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూలీ, మేస్త్రీ పనులు చేస్తూ చదువును కొనసాగించి పీహెచ్‌డీ సాధించడం ద్వారా నరసింహ తన పట్టుదలను చాటుకున్నారు. లక్ష్యంపై దృఢమైన నమ్మకం, సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం, కష్టాలు కూడా విజయానికి అడ్డుకావని ఆయన జీవితం నిరూపిస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు