హైదరాబాద్, సెప్టెంబర్ 6 (జనవాణి): భక్తుల కోరికలు తీర్చే భక్తజనుల ఇలవేల్పుగా కొలువైన బొడుప్పల్ శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సౌభాగ్య లక్ష్మీ, సుమంగళి లక్ష్మీ రూపాల్లో అలంకరించి, మహిళామణులచే లక్ష నామాలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
అమ్మవారికి లక్ష గాజులతో చేసిన విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గాజులను శుభప్రదంగా, మంగళకరంగా, సౌభాగ్యానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. లక్ష గాజులతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా శక్తి, శాంతి, సౌభాగ్యం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

అమ్మవారి దివ్య అలంకరణను దర్శించుకునేందుకు హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, సెట్లర్ కళావతి, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చంద్రశేఖర్ శర్మ, అర్చకులు శ్రీ ఉమాకాంత్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.




















