వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా చిన్నారులను తీసుకెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే కొందరు వాహనదారులు నిబంధనలను పట్టించుకోకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో ఓ వృద్ధుడు బైక్‌పై పలువురు చిన్నారులను తీసుకెళ్తున్నాడు. పెట్రోల్ ట్యాంక్‌పై కొందరు పిల్లలను కూర్చోబెట్టగా వెనుక సీటుపైనా పలువురు చిన్నారులు కూర్చున్నారు. అంతేకాదు, బైక్‌కు ఇరువైపులా ఉన్న ఫుట్‌రెస్టులపై కూడా పిల్లలు నిలబడి ఉన్నారు. వీరందరి వద్ద స్కూల్ బ్యాగులు ఉండటంతో వారిని పాఠశాలకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం ఆరుగురు నుంచి ఏడుగురు చిన్నారులు ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బైక్ నంబర్ ప్లేట్‌ను పరిశీలిస్తే అది ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌కు చెందినదిగా తెలుస్తోంది.
ఈ వీడియోను arshad_khan_886906 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసినట్లు సమాచారం. వీడియోకు భారీగా వ్యూస్, లైక్స్ రావడంతో పాటు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘బైక్‌ను ఏకంగా స్కూల్ బస్సుగా మార్చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ‘‘తక్కువ సీట్లు.. ఎక్కువ మంది ప్రయాణికులతో నడుస్తున్న దేశీ విమానం’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే వీడియోలోని దృశ్యాలు చూడటానికి కొంతమందికి హాస్యంగా అనిపించినప్పటికీ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకే బైక్‌పై ఇంతమంది చిన్నారులను తీసుకెళ్లడం వల్ల వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉందని, చిన్నారులు కిందపడే అవకాశం కూడా ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా అధిక సంఖ్యలో పిల్లలను ఒకే ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లడం ప్రమాదాలను ఆహ్వానించడమేనని పలువురు హెచ్చరిస్తున్నారు. రోడ్డు భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని ప్రభావం ప్రాణాలపై పడే అవకాశం ఉండటంతో.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.




















