OU పాత డిగ్రీ విద్యార్థులకు బిగ్ గుడ్‌న్యూస్.. బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్‌టైమ్ ఛాన్స్

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పాత డిగ్రీ బ్యాచ్‌ల విద్యార్థులకు కీలక అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్స్ కారణంగా డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2000-01 నుంచి 2015-16 విద్యా సంవత్సరాల మధ్య BA, B.Com, B.Sc, BBA, BSW కోర్సుల్లో చేరిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

12 ఆగస్టు, 2026 6:32 PM•ByNarender Kumar Nangunoori

Share this article

OU పాత డిగ్రీ విద్యార్థులకు బిగ్ గుడ్‌న్యూస్.. బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్‌టైమ్ ఛాన్స్

హైదరాబాద్, ఆగస్టు 12 (జనవాణి): ఉస్మానియా యూనివర్సిటీ (OU) పాత డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించింది. గతంలో యూజీ కోర్సుల్లో చేరి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. బ్యాక్‌లాగ్ పేపర్లను క్లియర్ చేసుకునేందుకు వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షలు రాసి పెండింగ్‌ పేపర్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈ ఏడాది జూలై 13వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు.

ఏ బ్యాచ్‌లకు అవకాశం?

ఈ ప్రత్యేక అవకాశం 2000-01 నుంచి 2015-16 విద్యా సంవత్సరాల మధ్య BA, B.Com, B.Sc, BBA, BSW కోర్సుల్లో అడ్మిషన్ తీసుకున్న అర్హులైన విద్యార్థులకు వర్తిస్తుంది. నిర్ణీత కాలవ్యవధిలో డిగ్రీ పూర్తి చేయలేక పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులను ఈ పరీక్షల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పరీక్షలు

వన్‌టైమ్ ఛాన్స్ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. పరీక్షల పూర్తి షెడ్యూల్, టైమ్‌టేబుల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. ఈ పరీక్షలకు 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్‌నే ప్రాతిపదికగా తీసుకోనున్నారు. కాబట్టి పాత బ్యాచ్‌ల విద్యార్థులు కూడా ఇదే సిలబస్ ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

ఒక్కో బ్యాక్‌లాగ్ పేపర్‌కు రూ.5,000 పెనాల్టీ

వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి బ్యాక్‌లాగ్ పేపర్‌కు రూ.5,000 పెనాల్టీ ఫీజు చెల్లించాలి. దీనికి అదనంగా సాధారణ పరీక్ష ఫీజు, మెమో ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

BA, B.Com, B.Sc, BSW విద్యార్థులకు:

2 పేపర్ల వరకు: రూ.990 పరీక్ష ఫీజు + రూ.150 మెమో ఫీజు

3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్లు: రూ.1,480 + రూ.150 మెమో ఫీజు

BBA విద్యార్థులకు:

2 పేపర్ల వరకు: రూ.1,250 + రూ.150 మెమో ఫీజు

3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్లు: రూ.1,700 + రూ.150 మెమో ఫీజు

ఇంగ్లీష్ CBT-1, CBT-2కు అదనంగా రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆగస్టు 28 వరకు అవకాశం

విద్యార్థులు ఆగస్టు 28లోగా ఎలాంటి లేట్ ఫీజు లేకుండా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యంగా దరఖాస్తు చేసుకునేవారికి రూ.500 లేట్ ఫీజుతో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు. కాలేజీలు విద్యార్థుల దరఖాస్తులు, ఫీజులను లేట్ ఫీజు లేకుండా ఆగస్టు 31లోగా, లేట్ ఫీజుతో సెప్టెంబర్ 9లోగా యూనివర్సిటీకి సమర్పించాల్సి ఉంటుంది.

పాత విద్యార్థులకు కీలక అవకాశం

ఎన్నో ఏళ్లుగా బ్యాక్‌లాగ్స్ కారణంగా డిగ్రీ సర్టిఫికెట్ పొందలేక ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఈ వన్‌టైమ్ ఛాన్స్ ఎంతో ఉపయోగపడనుంది. అర్హత ఉన్న విద్యార్థులు తమ సంబంధిత కాలేజీలను సంప్రదించి దరఖాస్తు గడువు, ఫీజు, అర్హత వివరాలను నిర్ధారించుకుని నిర్ణీత సమయంలో ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఓయూ అధికారులు సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు