హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో చట్టసభలను పక్కనపెట్టి రోడ్లపై ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ రోడ్లపై నిరసనలు చేయడం సరైన విధానం కాదని అన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు కోరాల్సిందిపోయి, రోడ్లపై ధర్నాలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం, మరోవైపు ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసనలకు దిగడం కాంగ్రెస్ రాజకీయ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్‌కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసి చర్చించాలని ఈటల సూచించారు. సభలో మాట్లాడే ధైర్యం, ఆధారాలు లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు వీధి రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నాయకులు రాజకీయ డ్రామాలు మానుకుని, పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని ఈటల రాజేందర్ కోరారు.




















