హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలే రియల్ ఎస్టేట్ వృద్ధికి నిదర్శనమని పేర్కొంటూ, త్వరలో మూసీ సుందరీకరణ పనులకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.

25 జులై, 2026 10:22 PM•ByLaharika

Share this article

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మందగించిందంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న అధికారిక గణాంకాలు వాస్తవ పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తున్నాయని చెప్పారు.

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని, ఫ్లాట్ల విక్రయాలు దాదాపు 40 శాతం వృద్ధి చెందాయని తెలిపారు.

గత పదేళ్లతో పోలిస్తే గత రెండున్నరేళ్లలో రెసిడెన్షియల్ మార్కెట్ మరింత బలపడిందని పేర్కొన్న మంత్రి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నమోదవుతున్న డాక్యుమెంట్ల సంఖ్య పెరగడం దీనికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు రియల్ ఎస్టేట్ రంగంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాల దూరదృష్టి ఫలితమని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ (ORR), అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ రంగ అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులు అమలు కావడం వల్లే నేడు హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దావోస్ పర్యటనలో పాల్గొన్నప్పుడు కూడా పలువురు అంతర్జాతీయ పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని పేర్కొన్న మంత్రి, రూ.7,000 కోట్లతో చేపట్టనున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తొలి దశ పనులకు వారం నుంచి పది రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. తొలి దశలో 28 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

అదేవిధంగా పాతబస్తీతో పాటు పలు ప్రాంతాలను అనుసంధానించే 76 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రాజెక్టును రూ.24,000 కోట్లతో అమలు చేయనున్నట్లు తెలిపారు. త్రిపుల్ ఆర్ (RRR) నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.

రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చి వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో భూముల భద్రత, యాజమాన్య హక్కులకు భరోసా కల్పించేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలులో ఉన్న చిన్నచిన్న సాంకేతిక సమస్యలను మరో 15 నుంచి 20 రోజుల్లో పరిష్కరించి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

రియల్ ఎస్టేట్ అభివృద్ధితో పాటు పేదలకు గృహాల కల్పనకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి చెప్పారు. క్యూర్ (CURE) పరిధిలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అనంతరం దశలవారీగా మరిన్ని ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం 2 నుంచి 3 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సమీకరించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థ తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు