హైదరాబాద్, ఆగస్టు 27 (జనవాణి): కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే తాను మాట్లాడుతున్నానని, పార్టీని బలహీనపరిచేలా ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘మాది అసలైన కాంగ్రెస్ రక్తం’ అని స్పష్టం చేసిన ఆయన.. పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉందన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కేటాయింపు అంశాలపైనే డిప్యూటీ సీఎంను కలిసినట్లు తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తినని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పలువురు కీలక నేతలు ఓడిపోయినా.. మునుగోడు ప్రజలు తనను గెలిపించారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్రయత్నించిన అప్పటి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా సర్వస్వం ధారపోసి పోరాడానని అన్నారు.
నిజమైన ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఎంతో పోరాడానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం కోసం పదవులను సైతం వదులుకున్నామని గుర్తు చేశారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని తప్ప.. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి, వారు గెలిచిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ, అధిష్టానంపై ఉందన్నారు. తెలంగాణలో నిజాయితీగా ఉద్యమంలో పోరాడిన వారు ఎంతో మంది ఉన్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నత పదవుల్లో ఉండొచ్చని అన్నారు. అయితే అందుకోసం నిజమైన ఉద్యమకారులను కించపరిచేలా వ్యాఖ్యలు లేదా కథనాలు ఉండకూడదని సూచించారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
తాను అనునిత్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనను విమర్శించే వారు ముందుగా తమ స్థాయి, తనను ఎందుకు విమర్శిస్తున్నారనే విషయంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం
కొండా సుస్మితా పటేల్, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారని, ఈ అంశంలో సీఎం మాటే తన మాట అని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే అంశాలను పరిశీలించి పీసీసీకి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు.




















