హైదరాబాద్,సెప్టెంబర్ 16 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన తప్పులు, ప్రభుత్వ భూముల వ్యవహారం, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవు తదితర అంశాలపై సభలో చర్చ జరుగుతుందనే భయంతోనే మొదటి రోజు నుంచే కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.
కొంతమందిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పలు అంశాలు సభలో చర్చకు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రతిపక్షం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను సమానంగా చూస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమన్నారు. రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
సభాపతిని గౌరవించడం సభ్యుల సంప్రదాయమని సీఎం పేర్కొన్నారు. సభలో ప్రతి సభ్యుడి హక్కులను పరిరక్షించే బాధ్యత సభాపతిదేనన్నారు. తెలంగాణ శాసనసభలో అమలయ్యే కొన్ని నిబంధనలను గత ప్రభుత్వమే రూపొందించిందని, వాటి ప్రకారమే సభాపతి ఆదేశాలు ఇచ్చారని వివరించారు.
స్పీకర్ ఆదేశాలను గేట్-3 వద్ద పోలీసులు అమలు చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నల్ల టీషర్ట్ ధరించి వెళ్లిన విషయాన్ని ప్రతిపక్ష నేతలు ప్రస్తావిస్తున్నారని, అయితే నినాదాలు లేదా సందేశాలతో కూడిన టీషర్టులతో సభలోకి రావొద్దని స్పీకర్ ఆదేశిస్తే సభ్యులు వాటిని పాటించాల్సి ఉంటుందని అన్నారు.
లోక్‌సభ స్పీకర్ పార్లమెంట్‌లో అలాంటి నిబంధనలు విధించలేదని, తెలంగాణ శాసనసభలో మాత్రం గత ప్రభుత్వమే సభ నిర్వహణకు సంబంధించి నిబంధనలు రూపొందించిందని సీఎం గుర్తుచేశారు.
పోలీసులను దూషించడం, అర్ధనగ్న ప్రదర్శనకు దిగడం, సభాపతిని దూషించడం వంటి చర్యలకు ప్రతిపక్ష సభ్యులు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పి ప్రజా సమస్యలపై చర్చిస్తారని భావించి ప్రతిపక్ష నేతలను సభలోకి అనుమతించారని తెలిపారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విచక్షణ కోల్పోయి వ్యవహరించడంతోనే బీఆర్‌ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షం సభకు హాజరు కాకపోయినా ప్రజా సమస్యలపై చర్చించే బాధ్యత నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.




















