హైదరాబాద, సెప్టెంబర్ 18 (జనవాణి): హైదరాబాద్ నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వచ్ఛ ఆటో కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి వారు తరలివచ్చారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన కార్మికులు ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉపాధికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పలువురు మహిళా స్వచ్ఛ ఆటో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.




















