హైదరాబాద్,సెప్టెంబర్ 7 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు చెబుతున్న అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ మనస్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. సభలో మంత్రి సీతక్క మాట్లాడున్న సమయంలో స్పీకర్ కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఈ వ్యవహారానికి సంబంధించి తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. తాతా మధుపై చర్యలు తీసుకునే అంశంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆయనను మండలి నుంచి బహిష్కరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు స్పీకర్‌పై బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీకి కూడా బాధ్యత ఉందని శ్రీధర్‌బాబు అన్నారు. బీజేపీ నేతలు సభా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. స్పీకర్‌ను తాతా మధు అవమానించడంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సభ్యులు సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ రూల్స్ పాటించలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సభా నియమాలను గౌరవించడం లేదని ఆరోపించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని శ్రీధర్‌బాబు తీవ్రంగా మండిపడ్డారు.




















