హైదరాబాద్: రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యేక బృందాలకు గ్రీన్ సిగ్నల్
మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను పరిశీలించేందుకు వ్యవసాయ & సహకార శాఖ ముఖ్య కార్యదర్శి 6 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుల పర్యవేక్షణలో పనిచేసే ఈ బృందాలు ఈ వారంలో ఆకస్మికంగా మార్కెట్ కమిటీలను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నాయి.
ఏ అంశాలను పరిశీలిస్తారు?
తనిఖీల సందర్భంగా మార్కెట్ కమిటీల పరిపాలన, రైతులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ఆదాయ పరిరక్షణ, మార్కెట్ నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా రైతులు పంటలను విక్రయించే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాల పనితీరు, చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
అలాగే రైతులు గిట్టుబాటు ధర పొందుతున్నారా, వేలం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా, తక్కువ ధరలకు పంటలను విక్రయించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే అంశాలను కూడా అధ్యయనం చేయనున్నారు.
డిజిటల్ సేవలు, సెస్ వసూళ్లపై కూడా నిఘా
మార్కెట్ కమిటీల్లో అమలవుతున్న డిజిటల్ సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు, మార్కెట్ సెస్ ఎగవేతను నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. అవసరమైతే లోపాలను గుర్తించి తక్షణ చర్యలకు సూచనలు చేయనున్నాయి.
ప్రతి వారం ప్రభుత్వానికి నివేదిక
ప్రత్యేక బృందాలు తమ తనిఖీల అనంతరం ప్రతి వారం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నాయి. అందులో గుర్తించిన లోపాలు, తక్షణ చర్యలు అవసరమైన అంశాలు, విధానపరమైన సంస్కరణలతో పాటు మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సూచనలు పొందుపరచనున్నారు. తదుపరి వారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ & సహకార శాఖ ముఖ్య కార్యదర్శితో కలిసి ఈ నివేదికలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
రైతు ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం
రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం, మార్కెట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శక లావాదేవీలు నిర్వహించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించడం ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యతాయుతమైన, పారదర్శకమైన పరిపాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




















