హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ నేతలు నల్ల షర్టులు, మహిళా నేతలు నల్ల చీరలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. అయితే అసెంబ్లీలోకి ప్రవేశానికి అనుమతి లేదంటూ గేటు వద్ద పోలీసులు, సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దే నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తన చీరను పోలీసులు లాగారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని కన్నీటిపర్యంతమయ్యారు. తన కాలికి కూడా గాయమైందని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
అసెంబ్లీలో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే.. బయట ఉన్న మహిళలకు వీళ్లు ఏం రక్షణ కల్పిస్తారు? అంటూ సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు సంధించారు. మరోవైపు, తాము అసెంబ్లీలోకి వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న భయంతోనే తమను అడ్డుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరును నిరసిస్తూ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హరీశ్‌రావు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ టీషర్టులు విప్పి బనియన్లతో అసెంబ్లీ గేటు ముందు కూర్చున్నారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి కాలికి గాయమైంది. కేటీఆర్ చేతికి కూడా గాయమైనట్లు సమాచారం.




















