లైసెన్స్ కావాలంటే స్కిల్స్ చూపించాల్సిందే.. డ్రైవింగ్ టెస్ట్‌లో ఏఐ మార్కులు!

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. డ్రైవింగ్ టెస్టుల్లో రికమండేషన్లు, పైరవీలకు చెక్ పెట్టడంతో పాటు పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ టెక్నాలజీని తీసుకురావాలని రవాణా శాఖ నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లోని ఐదు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ఆర్టీఓ ట్రాక్‌లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

29 సెప్టెంబర్, 2026 7:26 PM•ByNarender Kumar Nangunoori

Share this article

లైసెన్స్ కావాలంటే స్కిల్స్ చూపించాల్సిందే.. డ్రైవింగ్ టెస్ట్‌లో ఏఐ మార్కులు!

Janavaani Image

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం మరింత కఠినంగా, పారదర్శకంగా మారనుంది. డ్రైవింగ్ టెస్టుల్లో మానవ జోక్యాన్ని తగ్గించి, అర్హత ఉన్నవారికే లైసెన్స్‌లు అందేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వీడియో అనలిటిక్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ సన్నాహాలు చేస్తోంది.

డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఆధునీకరించి, పరీక్ష సమయంలో అభ్యర్థి ప్రతి కదలికను ఏఐ కెమెరాలు, సెన్సార్ల ద్వారా పర్యవేక్షించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. దీంతో రికమండేషన్లు, పైరవీలు, మానవ జోక్యానికి అవకాశం లేకుండా పరీక్ష ఫలితాలను సాంకేతికత ఆధారంగా నిర్ణయించే అవకాశం ఉంటుంది.

కొండాపూర్, నాగోల్ ట్రాక్‌ల పరిశీలన

ఈ ఆధునీకరణలో భాగంగా రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు కొండాపూర్, నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను పరిశీలించారు. ప్రస్తుత ట్రాక్‌ల సామర్థ్యం, ఏఐ కెమెరాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, అవసరమైన మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రతను పెంచాలంటే డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు కఠినంగా, పారదర్శకంగా ఉండాలని అధికారులు భావిస్తున్నారు. డ్రైవింగ్‌లో నిజమైన నైపుణ్యం ఉన్నవారికే లైసెన్స్‌లు లభించేలా సాంకేతికతను వినియోగించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.

ఢిల్లీ, యూపీ, ఒడిశాలో అధ్యయనం

ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ విధానం అమల్లో ఉన్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో తెలంగాణ రవాణా శాఖకు చెందిన అధ్యయన కమిటీ ఇప్పటికే పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్న సాంకేతికత, దాని ఫలితాలు, అమలులో ఎదురవుతున్న సవాళ్లను కమిటీ పరిశీలించింది. ఈ అధ్యయన ఆధారంగా త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నారు.

తొలి దశలో 6 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు

తొలి దశలో మొత్తం ఆరు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో ఏఐ ఆధారిత పరీక్ష విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు.

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లోని 5 ప్రధాన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు

కరీంనగర్ ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్

ఈ ట్రాక్‌లను ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే దిశగా రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఏఐ ఎలా పరీక్షిస్తుంది?

టెస్ట్ ట్రాక్‌ల వెంట హై-రిజల్యూషన్ ఏఐ కెమెరాలు, సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థి డ్రైవింగ్ చేసే సమయంలో అతడి పనితీరును సాఫ్ట్‌వేర్ నిరంతరం విశ్లేషిస్తుంది.

రివర్స్ డ్రైవింగ్ విధానం

8 ఆకారంలో డ్రైవింగ్

H ట్రాక్‌లో వాహనం నియంత్రణ

వాహన నియంత్రణ, డ్రైవింగ్ నైపుణ్యం

ట్రాఫిక్ నిబంధనల పాటింపు

వంటి అంశాలను ఏఐ ఆధారిత వ్యవస్థ విశ్లేషించనుంది.

సాఫ్ట్‌వేర్‌దే తుది నిర్ణయం

ప్రస్తుత విధానంలో ఉండే మానవ జోక్యాన్ని వీలైనంత వరకు తగ్గించి, పరీక్షలో అభ్యర్థి పనితీరును సాఫ్ట్‌వేర్ ఆధారంగా అంచనా వేయనున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఉత్తీర్ణత లేదా అనుతీర్ణత వివరాలు నేరుగా సాఫ్ట్‌వేర్‌లోనే నమోదు అయ్యేలా వ్యవస్థను రూపొందించనున్నారు.

ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కేవలం పరీక్ష పాస్ కావడం కాకుండా, వాస్తవంగా వాహనం నడిపే నైపుణ్యం ఉండటం కీలకం కానుంది. డ్రైవింగ్ పరీక్షల్లో పారదర్శకత పెంచడంతో పాటు రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని రవాణా శాఖ భావిస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు