రైతన్నతో పాటు నేతన్నకూ అండగా ఉంటాం.. చేనేత రంగ పునరుజ్జీవనమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల వెల్లడి

రైతుల సంక్షేమంతో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

7 ఆగస్టు, 2026 6:20 PM•ByRalin

Share this article

రైతన్నతో పాటు నేతన్నకూ అండగా ఉంటాం.. చేనేత రంగ పునరుజ్జీవనమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): రైతుల సంక్షేమంతో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోతున్న సంప్రదాయ చేనేత కళలకు పునర్వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేనేత పురస్కారాలకు ఎంపికైన కళాకారులను సత్కరించారు. చేనేత రంగానికి వారు అందిస్తున్న సేవలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.

అనంతరం పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన 100కు పైగా స్టాళ్లను పరిశీలించారు. సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్లను జోడించి రూపొందించిన వస్త్రాలు, అవార్డు గ్రహీతల ప్రత్యేక ఉత్పత్తులను పరిశీలించి వారిని అభినందించారు. ఈ ప్రదర్శన ఆగస్టు 16 వరకు కొనసాగుతుందని, ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

చేనేత మన సంస్కృతికి ప్రతీక

చేనేత కేవలం ఉపాధి మార్గం కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి ప్రతీక అని తుమ్మల పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం అందరి బాధ్యతన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులు ఇప్పటికే దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాయని చెప్పారు.

గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్‌, నారాయణపేట వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్‌ దర్రీస్‌, కరీంనగర్‌ బెడ్‌షీట్లు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని వివరించారు. మారుతున్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ చేనేతను ఆధునికీకరిస్తూ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

నేతన్న రుణమాఫీకి రూ.49.27 కోట్లు

చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో తెలంగాణ ముందంజలో ఉందని తుమ్మల తెలిపారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆ సంస్థ విద్యార్థి వగ్గు శ్రీరామ్‌ రూపొందించిన 'ఎర్గోనామిక్‌ బ్యాక్‌ సపోర్ట్‌ సిస్టమ్‌' జాతీయస్థాయిలో తొలి బహుమతి సాధించడాన్ని ప్రస్తావించారు.

నేతన్నల సంక్షేమానికి రెండేళ్ల కాలపరిమితితో పొదుపు పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 'నేతన్నకు భద్రత' పథకం ద్వారా చేనేత కార్మికుడు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందిస్తున్నామన్నారు. చేనేత రుణమాఫీ కోసం రూ.49.27 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. 'నేతన్న భరోసా' కింద చేనేత కార్మికులకు ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.15 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో మంత్రి సీతక్క, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌, హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దూడం వెంకట్‌రమణ, టెస్కో అధికారులు, చేనేత రంగ ప్రముఖులు, అవార్డు గ్రహీతలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు