హైదరాబాద్, ఆగస్టు 6 (జనవాణి): యాసంగి 2025-26 సీజన్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో కొనుగోలు చేసిన జొన్నలకు సంబంధించి రూ.994 కోట్లను 1,01,376 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం తన శాఖ పరిధిలోని అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. సాగు నుంచి విక్రయం వరకు రైతులకు సంపూర్ణ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మరో 10 జిల్లాల్లో ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానం
రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (FFS) విధానాన్ని రాష్ట్రంలో మరో 10 జిల్లాలకు విస్తరించినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం ద్వారా ఆధార్ ఆధారిత ధృవీకరణతో రైతులు ఎరువులు కొనుగోలు చేయడంతో పాటు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న నిల్వలను రియల్‌టైమ్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, మళ్లింపులను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులు, ఎరువుల డీలర్లకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆయిల్ పామ్ విస్తరణపై దృష్టి
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులు కోరిన వెంటనే మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇతర కంపెనీల నుంచి మొక్కలను సమీకరించాలని సూచించారు. డ్రిప్ వ్యవస్థ ఏర్పాటు, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026 జాతీయ విజేతకు సన్మానం
హ్యాండ్లూమ్ హ్యాకథాన్–2026లో జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) విద్యార్థి వగ్గు శ్రీరామ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. నేత కార్మికుల వెన్నునొప్పి వంటి సమస్యలను తగ్గించేలా రూపొందించిన "ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్" ఆవిష్కరణ ప్రశంసనీయమని, హ్యాండ్లూమ్ రంగంలో యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావడం శుభపరిణామమని మంత్రి అన్నారు.





















