తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం రెండో విడత నియామకాల జాబితాను విడుదల చేశారు. ఇందులో మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించడంతో పాటు 9 లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా పార్టీ బాధ్యతలను అప్పగించారు.
ఇప్పటికే తొలి విడతలో 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించిన పార్టీ, ఇప్పుడు రెండో విడతలో మరో 19 స్థానాలకు నాయకులను నియమించింది. మొత్తం 19 మంది ఇన్‌ఛార్జీల్లో 10 మందికి పైగా బీసీ వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించడం విశేషంగా మారింది.
బీసీలకు మరోసారి ప్రాధాన్యం
పార్టీ విస్తరణలో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంటూ, రెండో విడత నియామకాలలో కూడా బీసీ వర్గాలకు అధిక అవకాశాలు కల్పించినట్లు పార్టీ వెల్లడించింది. వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలను బీసీ నాయకులకు అప్పగించింది.
అనుబంధ విభాగాలకు కొత్త బృందాలు
తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పడాల మనోజ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కనగల చైతన్య, ఉపాధ్యక్షురాలిగా అయిలి కవితను నియమించారు.
విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జానపాటి రాము యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మునుకుంట్ల నవీన్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా చింతలపాటి రాధశ్రీకి బాధ్యతలు అప్పగించారు.
అలాగే బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అల్లంపల్లి రామకోటి, ప్రధాన కార్యదర్శిగా గొరిగె నర్సింహా, ఉపాధ్యక్షులుగా కుసుమ రజిత, ఈదులకంటి శైలజ గౌడ్‌లను నియమించారు.
జిల్లా అధ్యక్షుల ప్రకటన
పార్టీ జిల్లా కమిటీలను కూడా బలోపేతం చేస్తూ గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నడిపెల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కుందూరు దేవేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలిగా సుమలత సుధాకర్ శర్మను పార్టీ నియమించింది.
ఈ నియామకాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలంగాణ రక్షణ సేన నాయకత్వం పేర్కొంది.




















