తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్‌ల సమర్పణ, వాటి డిజిటలైజేషన్‌కు విధించిన గడువు ఆగస్టు 10తో ముగియనుంది. దీంతో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించిన ఓటర్లు తమ వివరాలు డిజిటలైజ్ అయ్యాయో లేదో ఒకసారి తప్పనిసరిగా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే. ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించకపోవడం లేదా సమర్పించిన ఫామ్ డిజిటలైజ్ కాకపోవడం వల్ల తదుపరి ఓటర్ల జాబితాలో పేరు కనిపించకపోయే అవకాశం ఉంది. అందుకే ఫామ్ స్టేటస్‌ను ముందుగానే నిర్ధారించుకోవడం కీలకం.
SMS ద్వారా ఇలా చెక్ చేసుకోండి
మీ ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటలైజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి మొబైల్ నుంచి 1950 నంబర్‌కు సింపుల్‌గా ఎస్‌ఎంఎస్ SMS పంపాల్సి ఉంటుంది. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ (EPIC Number) ఎంటర్ చేసి... ఆ మెసేజ్‌ను 1950కు పంపాలి. అనంతరం మీ పేరు, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్, నియోజకవర్గం తదితర వివరాలతో సందేశం వస్తే.. మీ ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటలైజ్ అయినట్లు అర్థం. ఒకవేళ ఇప్పటికే ఫామ్ సమర్పించినప్పటికీ ఎలాంటి సమాచారం రాకపోతే వెంటనే సంబంధిత BLO (బూత్ లెవల్ ఆఫీసర్)ను సంప్రదించాలి.
ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫామ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
ఇక, మీ ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజ్ చేశారా? లేదా? అనేది ఆన్‌లైన్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్ 1: ముందుగా ECI ఓటర్ సర్వీస్ పోర్టల్ను సందర్శించాలి.
స్టెప్ 2: అక్కడ కనిపించే Fill Enumeration Form ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మీ మొబైల్ నంబర్ లేదా EPIC కార్డు నంబర్ ఎంటర్ చేయాలి.
స్టెప్ 4: క్యాప్చా (CAPTCHA) పూర్తి చేసి Request OTPపై క్లిక్ చేయాలి.
స్టెప్ 5: మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి Submit చేయాలి.
స్టెప్ 6: స్క్రీన్‌పై కనిపించే డ్రాప్‌డౌన్‌లో మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
స్టెప్ 7: మీ EPIC నంబర్‌ను నమోదు చేసి Searchపై క్లిక్ చేయాలి.
మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇప్పటికే డిజిటలైజ్ అయి ఉంటే 'Your form has already been submitted. For more details contact your BLO' అనే సందేశం కనిపిస్తుంది. అదే ఫామ్ డిజిటలైజ్ కాకపోతే.. ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫామ్‌ను పూర్తి చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
2.64 కోట్లకు పైగా ఫామ్‌లు డిజిటలైజేషన్
తెలంగాణ ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం సుమారు 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,64,30,494 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్‌లు డిజిటలైజ్ అయినట్లు సమాచారం. మరికొన్ని ఫామ్‌లు ప్రస్తుతం BLOల వద్ద డిజిటలైజేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్యూమరేషన్ ఫామ్‌ల సమర్పణ, డిజిటలైజేషన్‌కు నేటితో గడువు ముగియనుండటంతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి.
ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా
ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించిన ఓటర్ల వివరాలతో ఈ నెల 17న అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ కాని ఓటర్ల వివరాలు ఈ జాబితాలో ఉండవు. ఆ తర్వాత అర్హతకు సంబంధించిన నోటీసులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని దశలు పూర్తైన తర్వాత అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. అందువల్ల ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించిన ప్రతి ఓటరూ తమ ఫామ్ డిజిటలైజ్ అయిందో లేదో వెంటనే చెక్ చేసుకోవడం మంచిది. ఏదైనా సమస్య ఉంటే గడువు ముగిసేలోపు సంబంధిత BLOను సంప్రదించాలి.




















