రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

4 ఆగస్టు, 2026 1:36 PM•ByRalin

Share this article

రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

వేములవాడలో ఏటీసీలకు భూమి పూజ చేస్తున్న మంత్రి జి.వివేక్ వెంకటస్వామి. చిత్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్ తదితరులు

వేములవాడ, ఆగస్టు 4: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేవలం శిక్షణతో ఆగిపోకుండా దేశ, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు.

వేములవాడలో రూ.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఏటీసీ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం ఉదయం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యువతలో ఉద్యోగాలపై ఆశలు పెరుగుతున్నాయని, గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఆ స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీపైనా దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే సుమారు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, రెండు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

సాంకేతిక మార్పులకు అనుగుణంగా కోర్సులు

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని, కృత్రిమ మేధ (ఏఐ), డ్రోన్స్‌, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక తయారీ రంగాలకు భారీగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమవుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏటీసీల్లో పరిశ్రమలకు అనుగుణమైన కోర్సులను రూపొందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల యువత కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు.

వ్యవసాయ రంగంలోనూ ఆధునిక సాంకేతికతను పరిచయం చేసేందుకు ఐక్రిశాట్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులపై కూడా ఏటీసీల్లో ప్రత్యేక కోర్సులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ శిక్షణకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఏటీసీలు, ఐటీఐల్లో శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ అందిస్తున్నామని మంత్రి చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తయ్యాక పరిశ్రమలకు అవసరమైన స్థాయిలో యువతను తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉపాధి

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్‌కామ్ సంస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని మంత్రి తెలిపారు. ఐటీఐ విద్యార్థులు, నర్సులు, కేర్‌గివర్లు, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు జర్మనీ, జపాన్ తదితర దేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు.

జర్మన్‌, జపనీస్ భాషల్లో శిక్షణ పొందిన వారికి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఏడాదికి రూ.25 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని, విదేశాల్లో పనిచేసే యువత తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచగలరని అన్నారు.

మందమర్రిలో శిక్షణకు మంచి స్పందన

మందమర్రి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో ఇప్పటికే జర్మన్ భాషా శిక్షణ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రెండు నెలలుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు కోర్సు పూర్తికాగానే జర్మనీలో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. భాషా శిక్షణ పూర్తయిన వెంటనే వారికి రూ.2.5 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.

వేములవాడ నుంచి 100 మందికి అవకాశం

వేములవాడ నియోజకవర్గానికి కూడా టామ్‌కామ్ ద్వారా ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆసక్తి చూపితే తొలి దశలో 100 మంది యువతను ఎంపిక చేసి భాషా శిక్షణ ఇవ్వడంతో పాటు విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. శిక్షణ కోసం అవసరమైన ట్రైనర్లను టామ్‌కామ్ సంస్థ పంపిస్తుందని, ఉద్యోగాల బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

విదేశాలకు వెళ్లే యువత మధ్యలో శిక్షణ మానేయకుండా ప్రజాప్రతినిధులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఒకసారి మంచి ఉద్యోగం పొందిన యువత తమ ప్రాంతంలోని మరికొందరికి కూడా అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఏటీసీలతో ఉపాధి విప్లవం

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు నిరుద్యోగ యువత జీవితాల్లో మార్పు తీసుకొస్తాయని మంత్రి తెలిపారు. కేవలం సర్టిఫికెట్ ఇచ్చే శిక్షణ కాకుండా ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం ద్వారా తెలంగాణను స్కిల్ డెవలప్‌మెంట్‌లో దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు