డిగ్రీ ఒక్కటే సరిపోదు.. పరిశ్రమ కోరేది ఈ నైపుణ్యాలే!

డిగ్రీ ఒక్కటే ఉద్యోగానికి సరిపోదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని యువతకు సూచించారు.

8 ఆగస్టు, 2026 8:05 PM•ByLaharika

Share this article

డిగ్రీ ఒక్కటే సరిపోదు.. పరిశ్రమ కోరేది ఈ నైపుణ్యాలే!

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనవాణి): డిగ్రీలు, మార్కుల మెమోలు మాత్రమే ఉద్యోగాలను తీసుకురావని.. పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్నప్పుడే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విద్య, పరిశ్రమ, ఉపాధిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి తెలంగాణ యువతను భవిష్యత్‌ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

రాయదుర్గంలోని టీ–వర్క్స్‌ ప్రాంగణంలో శనివారం జరిగిన ఫ్యూచర్‌ స్కిల్స్‌ సమ్మిట్‌–అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. క్వాలిటీ థాట్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఫౌండేషన్‌ పరిశ్రమ, విద్యాసంస్థలు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

ఏటా 2 లక్షలకుపైగా గ్రాడ్యుయేట్లు

తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల నుంచి ఏటా 2 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని శ్రీధర్‌బాబు తెలిపారు. వారికి డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీ ఒక్కటే సరిపోదన్నారు. పరిశ్రమకు నైపుణ్యాలు, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్‌, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారే శక్తి, నిరంతరం నేర్చుకునే తత్వం అవసరమని చెప్పారు.

యువతే తెలంగాణ అతిపెద్ద వనరు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ యువ జనాభాను అతిపెద్ద వనరుగా గుర్తించామని మంత్రి తెలిపారు. యువత నైపుణ్యాలతో కూడిన మానవ వనరుగా మారినప్పుడే అది నిజమైన డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌గా మారుతుందన్నారు. కేవలం విద్య అందించడం తమ లక్ష్యం కాదని.. ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఐటీఐల్లో భారీ మార్పులు

పాతకాలం నాటి ఐటీఐ కోర్సులను ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తయారీ రంగంలో రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, డిజిటల్‌ టెక్నాలజీలకు డిమాండ్‌ పెరుగుతోందన్నారు. మన ఐటీఐలు నిన్నటి పరిశ్రమ కోసం కాకుండా.. రేపటి ఫ్యాక్టరీల కోసం యువతను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

టాటా సన్స్‌ సహకారంతో రూ.2,400 కోట్లతో ఈ కేంద్రాలను భవిష్యత్‌ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. పరిశ్రమల్లో మొదటి రోజు నుంచే పనిచేయగల నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లను తయారు చేయడమే లక్ష్యమన్నారు.

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ దేశంలో నైపుణ్యాభివృద్ధికి కొత్త నమూనాగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. విద్య ఉపాధికి దారితీయాలని.. కోర్సుల రూపకల్పనలో పరిశ్రమకు మరింత బలమైన పాత్ర ఉండాలని అన్నారు. ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా ఉంటుందని.. పరిశ్రమే నైపుణ్యాల వ్యవస్థలో కేంద్రంగా ఉండాలని పేర్కొన్నారు. ఆనంద్‌ మహీంద్రా చైర్మన్‌గా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో యూనివర్సిటీ పనిచేస్తోందని తెలిపారు.

ఏఐ నుంచి సెమీకండక్టర్ల వరకు

ప్రతి విద్యార్థి డిగ్రీతోపాటు కనీసం ఒక పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించాలని శ్రీధర్‌బాబు సూచించారు. ఏఐ, డేటా సైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, డిజిటల్‌ మార్కెటింగ్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని అన్నారు. టెక్నాలజీ మారుతోందని.. పరిశ్రమలు మారతాయని.. కానీ నేర్చుకోవాలన్న తపన మాత్రం మారకూడదని చెప్పారు. డిగ్రీతో చదువు ముగియదని.. జీవితాంతం నేర్చుకోవడం కొత్త ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరని స్పష్టం చేశారు.

ఏఐతో ఉద్యోగాల రూపమే మారుతుంది

కృత్రిమ మేధ ఐటీ రంగానికే పరిమితం కాకుండా వైద్యం, తయారీ, ఆర్థిక రంగం, విద్య, వ్యవసాయం సహా దాదాపు అన్ని రంగాలను మారుస్తోందని మంత్రి తెలిపారు. ఏఐతో ఉద్యోగాలు మారతాయని.. అదే సమయంలో కొత్త వృత్తులు, కొత్త పరిశ్రమలు, కొత్త అవకాశాలు భారీగా వస్తాయని చెప్పారు. ఏఐ, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ టెక్నాలజీలు భవిష్యత్‌ సాంకేతిక విప్లవానికి కీలకంగా మారనున్నాయని తెలిపారు.

20 వేల ఉద్యోగ అవకాశాలు

బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగంలో సుమారు 20 వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగావకాశాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శిక్షణ ఇవ్వడమే కాకుండా.. నేరుగా ఉపాధితో అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గ్రామాల్లోనూ డిజిటల్‌ అవకాశాలు

గ్రామాలకు విస్తరిస్తున్న డిజిటల్‌ మౌలిక వసతులు భవిష్యత్‌లో తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారతాయని మంత్రి అన్నారు. గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్టివిటీ, టియర్‌–2, టియర్‌–3 పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో యువత తమ స్వస్థలాల నుంచే చదువు, ఉద్యోగం, వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నామని చెప్పారు.

క్లాస్‌రూమ్‌.. వర్క్‌ప్లేస్‌ అనుసంధానం కావాలి

నైపుణ్యాల అంతరాన్ని ప్రభుత్వం ఒక్కటే పూడ్చలేదని.. పరిశ్రమలు విద్యా వ్యవస్థలో భాగస్వాములు కావాలని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. పరిశ్రమలు కోర్సుల రూపకల్పనలో భాగస్వాములు కావడం, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్‌ ప్రాజెక్టులు, మెంటరింగ్‌ అందించడం ద్వారా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాలని సూచించారు. క్లాస్‌రూమ్‌, వర్క్‌ప్లేస్‌ రెండు వేర్వేరు ప్రపంచాలుగా ఉండకూడదని.. అవి పరస్పరం అనుసంధానమై ఉండాలని అన్నారు.

ప్రతి విద్యార్థి కళాశాల నుంచి కేవలం డిగ్రీతో బయటకు రాకుండా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ప్రాక్టికల్‌ అనుభవం, విలువ సృష్టించే సామర్థ్యంతో బయటకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫ్యూచర్‌ స్కిల్స్‌ సమ్మిట్‌ నిర్వాహకులు రమణ, క్రిష్‌, టీ–వర్క్స్‌ సీఈవో జోగిందర్‌ తణికెళ్ల, టాస్క్‌ సీఈవో నితిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు