హైదరాబాద్, ఆగస్టు 6 (ఈనాడు): అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఫైర్ ఎన్‌వోసీలు) సమర్పించిన ఘటనను తెలంగాణ ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో అంతర్గత విచారణను ప్రారంభించింది. ఈ అంశంపై సంబంధిత అధికారుల చర్యలు ఇప్పటికే కొనసాగుతున్నాయని బోర్డు వెల్లడించింది.
బోర్డుకు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీల ప్రామాణికతను పరిశీలిస్తున్నామని, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. చెల్లుబాటు అయ్యే అఫిలియేషన్ లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నట్లు లేదా ఇతర ఉల్లంఘనలు జరిగినట్లు తేలినా చర్యలు తప్పవని పేర్కొంది.
ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని, వాస్తవాలను పూర్తిగా నిర్ధారించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది. తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు నిర్ధారణ లేని వార్తలు, వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించింది. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ, అఫిలియేషన్ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనానికి బోర్డు కట్టుబడి ఉందని పేర్కొంది.





















