నెల్లూరు, అక్టోబర్ 5 జనవాణి): ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది. మనుబోలు బీసీ కాలనీ సమీపంలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ఏకంగా మూడు నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. శివలింగం చుట్టూ తిరుగుతూ కనిపించిన నాగుపాములు కాసేపు దానిని చుట్టుకుని పడుకున్నాయి. ఆ తర్వాత మూడు నాగుపాములు శివలింగం ముందు పక్కపక్కనే పడగవిప్పి నిలబడటంతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు. భక్తులు వాటిని చూసి దండాలు పెట్టుకున్నారు. అనంతరం ఆ మూడు నాగుపాములు ఆలయ పరిసరాల్లోని పుట్టలోకి వెళ్లిపోయాయి.
ఈ అరుదైన దృశ్యాలను కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. సోమవారం రోజున శివలింగం వద్ద మూడు నాగుపాములు కనిపించడాన్ని భక్తులు దైవ సంకేతంగా భావిస్తున్నారు. అయితే ఈ ఆలయంలో నాగుపాములు కనిపించడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గత ఏడాది మే 17న అభిషేకం అనంతరం ఓ నాగుపాము శివలింగంపై పడగవిప్పి కనిపించిందని తెలిపారు. అలాగే గత ఏడాది అక్టోబర్‌లో నాగుల చవితి సందర్భంగా రెండు నాగుపాములు శివలింగం సమీపంలో కనిపించాయని గుర్తుచేశారు. తరచూ ఆలయంలో నాగసర్పాలు కనిపించడం ఈ క్షేత్ర మహత్యంగా స్థానికులు విశ్వసిస్తున్నారు.
Loading Tweet...




















