తిరుమల,సెప్టెంబర్ 18 (జనవాణి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి టీటీడీ తెరదించింది. శ్రీవారి లడ్డూలో కొబ్బరి పీచు ఉన్నట్లు వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్నది అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 17న అధికారిక ప్రకటన విడుదల చేసింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపింది. శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో భక్తి, శ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం బాధ్యతారాహిత్యమని టీటీడీ పేర్కొంది.
భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, టీటీడీ అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
పోలీసుల దర్యాప్తు
ఈ వ్యవహారంపై టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో మూలం, దాని వాస్తవికత, దానిని ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అనుమతి లేని లేదా నిర్ధారణ కాని ఫొటోలు, పోస్టులను షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని భావించకుండా అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని సూచించారు.
వైసీపీ విమర్శలు
మరోవైపు, ఈ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రత విషయంలో గతంలోనూ వివిధ ఆరోపణలు వచ్చాయని ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. ‘‘శ్రీవారి లడ్డూలో ఏంటిది చంద్రబాబు, బీఆర్ నాయుడు... పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో మొన్నటి వరకు తేళ్లు, జెర్రులు, బొద్దింకలు, ఇతర కీటకాల అవశేషాలు కనిపించాయి. ఇప్పుడు కనీసం ఏంటో కూడా గుర్తుపట్టలేని విధంగా ఒకటి దర్శనం. తిరుమలను ప్రక్షాళన చేస్తానని బీరాలు పలికి అసమర్థుడికి పట్టం కట్టావు... అతను రెండేళ్లలోనే ప్రసాదం తినాలంటేనే భక్తులు భయపడే స్థితికి తీసుకొచ్చేశాడు. ఇద్దరు కలిసి తిరుమలను ఏం చేద్దామని అనుకుంటున్నారు చంద్రబాబు?’’ అని ప్రశ్నించారు.
Loading Tweet...
అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో శ్రీవారి లడ్డూదేనన్న వాదనను టీటీడీ స్పష్టంగా ఖండించింది. కాబట్టి వైరల్ పోస్టుల ఆధారంగా నిర్ధారణకు రాకుండా, దర్యాప్తు పూర్తయ్యే వరకు అధికారిక సమాచారం కోసం వేచి చూడటం అవసరం.




















