హైదరాబాద్, ఆగస్టు 18 (జనవాణి): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఎకరం చొప్పున భూమి అందిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పేదలకు భూమి ఎంతో కీలకమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూమి లేని పేద కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని, ఈ పథకానికి ‘భూ లక్ష్మి పథకం’గా పేరు పెట్టామని కవిత తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములతో పాటు అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సేకరించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
వివిధ ప్రాజెక్టుల పేరుతో ముందుగా అసైన్డ్ భూములనే ప్రభుత్వం తీసుకుంటోందని కవిత ఆరోపించారు. సుమారు 30 వేల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేదల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పేదల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి భూమిని కేవలం వాణిజ్య లావాదేవీగా చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు భూమి పంపిణీ జరిగిందని, అనంతరం ఆ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నప్పటికీ ఆచరణలో కనిపించడం లేదని కవిత ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, వారి వేతనాల్లోనూ సామాజిక న్యాయం కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆర్టీఐ కమిషన్‌లో బీసీలకు ప్రాతినిధ్యం లేదని ఆరోపించారు.
Loading Tweet...




















