కాంగ్రెస్‌తో తాను మంతనాలు చేశానన్న ఆరోపణలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని, లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి ఈ విషయం చెబుతున్నానని అన్నారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కవిత చెప్పగలరా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్‌రెడ్డి
బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్‌రెడ్డి.. ప్రశాంత్‌రెడ్డి అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. కవిత మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లారని విమర్శించారు.ఇప్పుడు కష్ట కాలంలో కేసీఆర్ వెంట ఉన్నది నేనా కవితనా? అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ప్రశాంత్ రెడ్డినా.. కవితనా?. కవితను కేసీఆర్‌తో కలపడానికి తాను ప్రయత్నించానా? లేక విడదీయడానికి ప్రయత్నించానా? అనే విషయం కేసీఆర్‌కు పూర్తిగా తెలుసన్నారు. పార్టీ లైన్ దాటిన తర్వాతే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.
కేసీఆర్ వెంట ఉన్నది నేనా.. కవితనా?
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందే తాను, తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి పార్టీలో ఉన్నామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, నిజామాబాద్ జిల్లాలో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నది తానేనని అన్నారు. తనపై కవిత చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా, స్వలాభం కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, తనలాంటి వారిని కవిత టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
కవిత చర్యలతో కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నారు
కవిత ప్రత్యక్షంగా పార్టీ నాయకత్వాన్ని బలహీనపరుస్తూ, పరోక్షంగా అధికార పార్టీకి మేలు చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సభలో కవిత కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ సానుభూతి పొందేందుకేనని తాను భావిస్తున్నానన్నారు. అయితే ఈ వ్యవహారం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్న ప్రశాంత్‌రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై కవిత విమర్శలు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. అయితే సొంత లాభం కోసం కవిత మాట్లాడటం బాధ కలిగించిందని చెప్పారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్‌కు బాగా తెలుసని ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.




















