వరంగల్-కరీంనగర్,అక్టోబర్ 1 (జనవాణి): ఓరుగల్లుకు మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. వరంగల్-కరీంనగర్ మధ్య నిర్మిస్తున్న నేషనల్ హైవే-563 (NH-563) పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.2,146.86 కోట్లను కేటాయించింది. ఇందులో భూసేకరణ, చెట్ల తొలగింపు, విద్యుత్ స్తంభాల మార్పిడి తదితర పనులకు రూ.505.86 కోట్లు, రహదారి నిర్మాణానికి రూ.1,641 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొత్తం 68.015 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా ఈ హైవేను నిర్మించారు. ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలో 46.24 కి.మీ., హనుమకొండ జిల్లా పరిధిలో 21.77 కి.మీ. మేర రహదారి ఉంది.
గంటన్నర ప్రయాణం.. 45 నిమిషాలకు!
హనుమకొండ జిల్లా పలివేల్పుల సమీపంలోని హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి-163 నుంచి ప్రారంభమయ్యే ఈ హైవే గుంటూరుపల్లి, ఎర్రగట్టుగుట్ట, హసన్‌పర్తి, ఎల్లాపూర్, ఎల్కతుర్తి మీదుగా సాగుతుంది. అక్కడి నుంచి హుజూరాబాద్, కేశవపట్నం మీదుగా మానకొండూరు బైపాస్ వరకు నిర్మించారు. హైవే అందుబాటులోకి వస్తే వరంగల్ నుంచి కరీంనగర్‌కు ప్రస్తుతం పడుతున్న దాదాపు గంటన్నర ప్రయాణ సమయం 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. ఈ మార్గంలో 23 వెహికల్ అండర్‌పాస్‌లు, 121 బాక్స్ కల్వర్టులు, 13 చిన్న వంతెనలు, రెండు పెద్ద వంతెనలు, రెండు ఫ్లైఓవర్లను నిర్మించారు.

సెప్టెంబర్ 5 నుంచి ట్రయల్స్
హైవే పనులు తుది దశకు చేరుకోవడంతో సెప్టెంబర్ 5 నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో రహదారిని అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్ సమీపంలోని కొత్తగట్టు వద్ద టోల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు. పనులను దసరా నాటికి పూర్తి చేసి, జాతీయ రహదారి-563ను వర్చువల్‌గా ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
అత్యాధునిక సాంకేతికతతో నిఘా
ఈ హైవేపై ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీల కెమెరాలను అమర్చి కేంద్రీకృత నిఘా కేంద్రం నుంచి ట్రాఫిక్‌ను పర్యవేక్షించనున్నారు. ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు వంటి పరిస్థితుల్లో ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు వేరియబుల్ మెసేజ్ సైన్స్ (VMS) డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. 1033 హెల్ప్‌లైన్‌తో పాటు రూట్ పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌లు, క్రేన్లను అందుబాటులో ఉంచుతున్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా 25 ప్రాంతాల్లో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. రహదారి మధ్యలో, ఇరువైపులా స్థానిక జాతుల మొక్కలను నాటుతూ పచ్చదనాన్ని పెంచుతున్నారు.
స్థానికులకు కొన్ని ఇబ్బందులు
కొత్త హైవే నిర్మాణంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గొల్లపల్లి, కొత్తగట్టు గ్రామాల వద్ద అండర్‌పాస్‌లు, గ్రీన్ కారిడార్ వంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ రోడ్డు ఉన్నప్పటికీ హైవేను దాటేందుకు నేరుగా అవకాశం లేకపోవడంతో ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు హుజూరాబాద్ అండర్‌పాస్ వరకు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం, కోతులనడుమ గ్రామాల్లోనూ ఇదే సమస్య ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఎకనామిక్ కారిడార్‌గా మారే అవకాశం
NH-563 అందుబాటులోకి వస్తే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమలు, నిర్మాణ రంగానికి అవసరమైన ముడి సరుకుల రవాణా మరింత వేగవంతం కానుంది. వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభం కానుంది. హైవే వెంట వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలకు మామునూరు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కూడా మెరుగుపడనుంది.
సిద్ధిపేటకు కూడా మెరుగైన కనెక్టివిటీ
NH-563తో పాటు సిద్ధిపేట-ఎల్కతుర్తి NH-765DG అనుసంధానం కానుంది. సుమారు రూ.579 కోట్లతో 64 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. సిద్ధిపేట, హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వద్ద వరంగల్-కరీంనగర్ హైవేతో ఇది కలవనుంది. ఈ రెండు రహదారులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల మధ్య రవాణా, వాణిజ్య, పారిశ్రామిక కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.




















