న్యూఢిల్లీ: పరీక్షల సంస్కరణల కోసం విద్యార్థులు నిర్వహించిన సీజేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనలతో పాటు మరో పేరు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్.
ఫిట్‌నెస్, మోటివేషనల్ కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న సోనియా.. జూలై 20న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో భద్రతా విధులు నిర్వహించారు. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో ఆమెకు గాయాలయ్యాయి. అనంతరం చేతికి స్లింగ్‌తో కనిపించిన ఆమె వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.
అయితే అసలు వివాదం ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో మొదలైంది. వైరల్ అయిన స్క్రీన్‌షాట్ల ప్రకారం, చనిపోయిన బొద్దింక ఫొటోను షేర్ చేస్తూ, "తమను తాము సరిచేసుకోలేని వాళ్లు దేశాన్ని మార్చాలని చూస్తున్నారు" అనే అర్థం వచ్చే క్యాప్షన్‌ను ఆమె పోస్టు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ పోస్టును విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీజేపీపై పరోక్ష విమర్శగా పలువురు భావించారు. అనంతరం ఆ స్టోరీ డిలీట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ పోస్టు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఇలాంటి రాజకీయ లేదా ఉద్యమాలకు సంబంధించిన అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం సమంజసమేనా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి.
ఇంతలో మరో అంశం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. నిరసనలకు కొన్ని రోజుల ముందు సోనియా సెహ్రావత్ గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు, పోస్టులు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించడంతో వాటిని కూడా కొందరు చర్చకు తీసుకొచ్చారు. డ్యూటీకి తిరిగి రావడానికి ముందు ఆమె సెలవుల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అనేక వ్యాఖ్యలు వచ్చాయి.
ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు, చేతికి స్లింగ్‌తో కనిపించిన దృశ్యాలు, యూనిఫామ్‌పై నేమ్‌ట్యాగ్ కనిపించకపోవడం వంటి అంశాలు కూడా నెటిజన్లలో చర్చకు దారితీశాయి. దీంతో సోనియా సెహ్రావత్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలు, పాత పోస్టులు, ఆమె ఆన్‌లైన్ కార్యకలాపాలు అన్నీ పెద్ద చర్చగా మారాయి.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, వాటి ఉద్దేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. డిలీట్ అయినట్లు చెబుతున్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ, గోవా ట్రిప్ ఫొటోలు, గాయాలతో ఇచ్చిన ఇంటర్వ్యూ.. ఈ మూడు అంశాలే ప్రస్తుతం సోనియా సెహ్రావత్‌ను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.




















