విజయవాడ, ఆగస్టు 7: చేనేత ఉత్పత్తులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక అని, చేనేత వస్త్రాలను ధరించి నేతన్నల శ్రమకు చేయూత అందించాలని పిలుపునిచ్చారు.
గత 12 ఏళ్లుగా రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని షర్మిల పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులపై 5 నుంచి 18 శాతం వరకు జీఎస్‌టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేతన్నలను సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. మరోవైపు సమగ్ర చేనేత విధానం, బరోసా, సబ్సిడీల పునరుద్ధరణ, చేయూత, మూడు సెంట్ల భూమి, మరణించిన నేతన్నల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా వంటి హామీలు ఇచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు 90 వేల చేనేత కుటుంబాలను మోసం చేశాయని విమర్శించారు.
చేనేత సహకార సంఘాలపై ఉన్న రుణాలను పూర్తిగా రద్దు చేయాలని, సబ్సిడీ రూపంలో చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నేతన్నలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంతో పాటు వస్త్ర తయారీలో ఉపయోగించే ముడి సరుకులను సబ్సిడీ ధరలకు అందించాలని కోరారు.
చేనేత రంగానికి కేటాయించిన 11 రకాల ఉత్పత్తుల రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలని, కేంద్రంలో హ్యాండ్‌లూమ్ బోర్డును పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను షర్మిల డిమాండ్ చేశారు.





















