Telangana Janasena: తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కల్యాణ్... ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. పవన్ కల్యాణ్ నిర్ణయంతో తెలంగాణలోని జనసేన నాయకులు కూడా యాక్టివ్ మోడ్‌లో వెళ్లారు. వివిధ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ జూన్ 19న హైదరాబాద్‌లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.
అయితే తెలంగాణ జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలో చేరికలను సమన్వయం చేసేందుకు తెలంగాణ జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమించాం. 7 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి చేరికలను సమన్వయం చేస్తుంది’’ అని జనసేన పార్టీ తెలంగాణ విభాగం తెలిపింది.
జనసేన భావజాలానికి ఆకర్షితులై పార్టీలో చేరాలనుకునే వారిని ప్రత్యేక జాయినింగ్స్ కమిటీ సమన్వయం చేయనుందని పేర్కొంది. ఈ కమిటీ ద్వారా వచ్చిన చిరకాల విజ్ఞప్తులు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పరిశీలించి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని తెలిపింది. పవన్ కల్యాణ్ సూచనల మేరకు చేరికల కార్యక్రమాలు నిర్వహించనున్నట్టుగా పేర్కొంది.




















