పరిశ్రమల్లో భద్రతపై రాజీ లేదు.. రిస్కీ పనుల్లో కాంట్రాక్ట్ కార్మికులు వద్దు : మంత్రి వివేక్

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రమాదకర కార్యకలాపాల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయించవద్దని పరిశ్రమలకు సూచించిన ఆయన, కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

29 జులై, 2026 1:51 PM•ByLaharika

Share this article

పరిశ్రమల్లో భద్రతపై రాజీ లేదు.. రిస్కీ పనుల్లో కాంట్రాక్ట్ కార్మికులు వద్దు  : మంత్రి వివేక్

రాష్ట్రంలోని పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాల అమలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని, ప్రతి పరిశ్రమలో బలమైన సేఫ్టీ కల్చర్‌ను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.

హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ)లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి 'ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టిబుల్ డస్ట్స్' వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబస్టిబుల్ డస్ట్ భద్రతపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సిగాచి ఘటన హెచ్చరికగా మారాలి

కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల కారణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సిగాచి ఘటన ప్రతి పరిశ్రమకు గుణపాఠంగా నిలవాలని పేర్కొన్నారు. భద్రతా చర్యల కోసం తక్కువ మొత్తాన్ని ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా సంస్థలకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

భద్రతపై ప్రతి బోర్డు సమావేశంలో సమీక్ష

ప్రతి కంపెనీ బోర్డు సమావేశంలో పారిశ్రామిక భద్రతపై ప్రత్యేక సమీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఫ్యాక్టరీ ఆక్యుపైయర్లు, బోర్డు సభ్యులు భద్రతా ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, సేఫ్టీ కోసం చేసే ఖర్చును వ్యయంగా కాకుండా సంస్థ భవిష్యత్తుపై పెట్టుబడిగా చూడాలని అన్నారు.

సేఫ్టీ కల్చర్‌తో ఉత్పాదకత పెరుగుతుంది

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపడితే కార్మికుల్లో విశ్వాసం పెరిగి ఉత్పాదకత కూడా గణనీయంగా మెరుగవుతుందని మంత్రి తెలిపారు. కార్మికులకు తరచూ సేఫ్టీ శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక సాంకేతికతలు, ఉత్తమ భద్రతా విధానాలను అమలు చేయాలని సూచించారు. ఇటువంటి వర్క్‌షాప్‌లు ప్రభుత్వం, పరిశ్రమలు పరస్పరం నేర్చుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు.

రిస్కీ ఆపరేషన్లలో కాంట్రాక్ట్ కార్మికులకు నో

ప్రమాదకర విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించవద్దని మంత్రి స్పష్టంగా సూచించారు. సిగాచి ఘటనలో ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు తగిన అనుభవం, శిక్షణ లేకపోవడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ప్రమాదకర కార్యకలాపాలు జరిగే విభాగాల్లో కంపెనీ శాశ్వత ఉద్యోగులే విధులు నిర్వహించేలా వచ్చే ఆరు నెలల్లో నిబంధనలు రూపొందించాలని ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు.

కొత్త భద్రతా మార్గదర్శకాలు

కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీలు వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు రూపొందించి అన్ని పరిశ్రమల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్‌కు మంత్రి సూచించారు. కార్మికుల ప్రాణ భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్ మోహన్ బాబు, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, వివిధ పరిశ్రమలకు చెందిన సీనియర్ అధికారులు, నిపుణులు, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, బొగ్గు, టెక్స్టైల్ తదితర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు