ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో సోమవారం అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకటి కాదు.. ఏకంగా మూడు నాగుపాములు శివలింగం చుట్టూ తిరుగుతూ, అనంతరం దాని ముందు పడగవిప్పి నిలబడటం కనిపించింది. భక్తులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి ప్లీనరీ సమయంలో సజ్జల, విజయసాయిరెడ్డి మధ్య వివాదం జరిగి కొట్టుకున్నది వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. వైసీపీలో విజయసాయికి అనేక అవమానాలు జరిగాయని ఆరోపించారు.
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో కార్డన్ సెర్చ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సరైన పత్రాలు లేవని సురేష్ అనే వ్యక్తి తన బండిని పక్క వీధిలోని ఓ ఇంట్లో దాచినట్లు సమాచారం. పోలీసులు తనిఖీలకు వచ్చిన సమయంలో అతడి ఆరేళ్ల కుమారుడు మహేంద్ర “మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచాడు” అంటూ పోలీసులకు చెప్పాడు. అంతేకాదు.. బండి దాచిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లి వాహనాన్ని చూపించాడు. చిన్నారి అమాయకంగా చెప్పిన మాటలతో దాచిన వాహనం పోలీసుల కంటపడింది. అనంతసాగరం కార్డన్ సెర్చ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.