గుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ కోసం కొడుకుతో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వెనుక సీటులో ఉన్న హరికృష్ణ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. కారు నడుపుతున్న ఆయన కుమారుడు అఖిలేష్ స్థానికుల సాయంతో బయటపడి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం సమీపంలో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తమ కుమార్తెలది ప్రమాదంలో జరిగిన మృతి కాదని, యువకులు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపుతోంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను బలవంతపూర్‌కు చెందిన భాగ్య, రాజు, పిల్లలు నియాన్, శాన్వికగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.