తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.
జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు ఏడు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆమోదం తెలిపింది.