పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.

12 సెప్టెంబర్, 2026 11:47 AM•ByNarender Kumar Nangunoori

Share this article

పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనవాణి): తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందనే ప్రచారం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, గతంలో ఎలాంటి స్థితిలో ఉన్నాయో ఇకపై కూడా అలాగే కొనసాగుతాయని తేల్చిచెప్పారు. తెలంగాణ శాసనసభలో రాష్ట్ర విద్యా విధానంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం సమాధానమిచ్చారు. పాలిటెక్నిక్‌లకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.97పై ఏర్పడిన సందేహాలపై ఆయన వివరణ ఇచ్చారు.

సాంకేతిక విద్యను ఆధునీకరించడమే లక్ష్యం

పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, టాటా సంస్థ సహకారంతో ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. దీనిని ప్రైవేటీకరణగా చూడకూడదన్నారు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పాలిటెక్నిక్‌ల విషయంలో భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని విద్యార్థుల్లో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏటీసీలకు కేటాయించిందని, ఒక్కో ఏటీసీపై సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

59 పాలిటెక్నిక్‌లకు రూ.4 వేల కోట్లతో ఆధునీకరణ

రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ కాలేజీలను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా కోర్సులను ఆధునీకరిస్తామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే సంస్కరణల ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హామీ

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. నిజాయితీగా వివరాలు సమర్పించిన కాలేజీల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే సమయానికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అందులో గత ప్రభుత్వ కాలానికి సంబంధించిన బకాయిల నుంచి రూ.1,410 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చెల్లింపులతో కలిపి 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌గా గ్రీన్ చానెల్‌లో నిధులు చెల్లిస్తున్నామని చెప్పారు.

విద్యా బడ్జెట్ భారీగా పెంపు

విద్యా రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. 2023-24లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా, 2024-25లో తమ ప్రభుత్వం రూ.21,292 కోట్లు కేటాయించిందన్నారు. 2025-26లో ఈ కేటాయింపులను రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచినట్లు చెప్పారు. కేవలం మూడేళ్లలో విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచామని వెల్లడించారు.

55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయులను నియమించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా నియామక ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించిందని ఆయన పేర్కొన్నారు.

ప్రీ-ప్రైమరీ విద్యపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని సీఎం తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో రెండున్నరేళ్లకే పిల్లలను చేర్చుకుంటుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల వయసు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నర్సరీ, ఎల్‌కేజీతో పాటు ఇంగ్లిష్ మీడియం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రారంభించామని, ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ విద్య అందిస్తున్నామని వెల్లడించారు.

జెన్ జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటాపై దృష్టి

రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. జెన్ జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలు, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలంగాణకు తీసుకువచ్చి రాష్ట్రాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కమిషన్ నివేదికను పరిశీలించేందుకు కే. కేశవరావు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సీఎం తెలిపారు. సభ్యులు, విద్యా నిపుణుల సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

“విద్య ఒక్కటే జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది” అనే విశ్వాసంతో ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఈ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు