హైదరాబాద్ September 8 (జనవాణి): తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈవీ వాహనదారులకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. ఈ స్టేషన్ల నిర్వహణతో పాటు అప్‌గ్రేడేషన్, వాణిజ్య కార్యకలాపాలను కూడా ఎంపికైన ఆపరేటర్లు చేపట్టాల్సి ఉంటుంది.
369 స్టేషన్లు ఎక్కడెక్కడ?
మొత్తం 369 స్టేషన్లలో 200 స్టేషన్లను గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని టీజీ రెడ్కో నిర్ణయించింది. మరో 169 స్టేషన్లను ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ ఈవీ వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది.
యూనిట్‌కు రూ.13 ఛార్జింగ్ టారిఫ్
ఈ ప్రాజెక్టులో వినియోగదారులకు ఈవీ ఛార్జింగ్ టారిఫ్‌ను యూనిట్ విద్యుత్‌కు రూ.13గా నిర్ణయించారు. కాంట్రాక్ట్ కాలం మొత్తం ఇదే టారిఫ్ అమల్లో ఉండేలా నిబంధనలు రూపొందించారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద అర్హత కలిగిన బిడ్డర్లకు నిబంధనల ప్రకారం రాయితీలు కూడా అందనున్నాయి.
టెండర్ దక్కిన కంపెనీల బాధ్యతలు:
ఎంపికైన కంపెనీలు కేవలం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా.. సర్వే, డిజైన్, పరికరాల సరఫరా, సివిల్ వర్క్స్, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ వంటి పనులను చేపట్టాలి. అనంతరం ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాలను కూడా కొనసాగించాల్సి ఉంటుంది.
95 శాతం అందుబాటులో ఉండేలా నిబంధన
హైదరాబాద్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసే ఛార్జర్లు వినియోగదారులకు కనీసం 95 శాతం సమయం అందుబాటులో ఉండేలా టీజీ రెడ్కో నిబంధనలు రూపొందించింది. ఛార్జింగ్ మౌలిక వసతుల నిర్వహణలో అంతరాయాలు తగ్గించడం ద్వారా ఈవీ వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
పదేళ్ల కాంట్రాక్ట్.. సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తులు
369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణకు కాంట్రాక్ట్ కాలాన్ని పదేళ్లుగా నిర్ణయించారు. టెండర్ బిడ్ల సమర్పణ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగియనుంది. ఆసక్తి ఉన్న సంస్థలు తెలంగాణ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది.




















