ఇండ్ల స్థలాలు, పెన్షన్, వైద్య సదుపాయాలు కల్పించాలి.. ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు జర్నలిస్టుల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, సంక్షేమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కోరారు

29 జులై, 2026 11:19 PM•ByRamchandram

Share this article

ఇండ్ల స్థలాలు, పెన్షన్, వైద్య సదుపాయాలు కల్పించాలి.. ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు జర్నలిస్టుల విజ్ఞప్తి

ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) నాయకులు

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, సంక్షేమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేయగా, సాధ్యమైన మేర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను APWJF రాష్ట్ర నాయకులు కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌ను ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద APWJF అధ్యక్షుడు బసవరాజు, ప్రధాన కార్యదర్శి చంద్ర మోహన్, రాష్ట్ర కార్యదర్శులు విజయ్, మురళి, రమేష్ రెడ్డి, ఆచారి తదితరులు కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు.

సంక్షేమానికి పలు ప్రతిపాదనలు

ప్రజలకు నిష్పక్షపాత సమాచారాన్ని అందించే జర్నలిస్టులు అనేక ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు గృహ స్థలాలు కేటాయించడం, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా వర్కింగ్ జర్నలిస్టుల చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ కమిటీల ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని కోరారు.

మీడియా అకాడమీ పునరుద్ధరణ కోరిన సంఘం

సమాచార శాఖను మరింత బలోపేతం చేయడం, జర్నలిస్టుల పిల్లల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించడం, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీని పునరుద్ధరించడం వంటి అంశాలను కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు.

విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంఘం నాయకులు కోరారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి

జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్వీకరించినట్లు APWJF నాయకులు తెలిపారు. సాధ్యమైన మేర వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

గమనిక: పై వివరాలు APWJF నాయకులు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా రూపొందించబడినవి.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు