తాడేపల్లి, ఆగస్టు 4: రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపునకు గురవుతున్న బాధితుల పక్షాన జెన్-జే (జనరేషన్ జగన్) ఉద్యమం కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ, బాధితులకు న్యాయం చేయించడమే జెన్-జే లక్ష్యమని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజకీయాల కారణంగా అన్యాయానికి గురవుతున్న వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. బాధితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, వారికి అన్యాయం జరిగితే మద్దతు ఇవ్వడం తమ విధానమని స్పష్టం చేశారు.
నారా లోకేశ్ పాదయాత్రలో యువతకు అనేక హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని వంగవీటి నరేంద్ర ఆరోపించారు. ప్రతి ఏడాది ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆలస్యం లేకుండా అమలు చేస్తామని చెప్పినా అవేవీ నెరవేరలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజులు చెల్లించకపోవడంతో కొందరు విద్యార్థులు విద్యాసంస్థల నుంచి సర్టిఫికెట్లు కూడా పొందలేకపోతున్నారని ఆరోపించారు.
డీఎస్సీపై సీబీఐ విచారణ కోరిన వైసీపీ
డీఎస్సీ–2025 నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అక్రమాలు జరిగాయని వంగవీటి నరేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉంటే సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం అంగీకరించాలని కోరారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన ప్రజాపక్ష రాజకీయాల స్ఫూర్తితోనే జెన్-జే పనిచేస్తోందని వంగవీటి నరేంద్ర తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరి పక్షాన నిలబడటమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజకీయ కక్షసాధింపుకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.





















