విజయనగరం, సెప్టెంబర్ 9 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర, పలువురు అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరడానికి ముందు మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి ఇన్‌ఛార్జ్ బాధ్యతలకు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపించారు. వైసీపీలో తనకు వివిధ పదవులు, బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించినందుకు వైఎస్ జగన్‌కు మజ్జి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆయన అకస్మాత్తుగా పార్టీని వీడటం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, గత కొన్ని నెలలుగా బొత్స సత్యనారాయణ వైసీపీని వీడతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను బొత్స ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారడానికి స్థానిక నాయకులతో ఉన్న విభేదాలే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పార్టీ మార్పుపై పూర్తి కారణాలు స్పష్టంగా వెల్లడించాల్సి ఉంది.




















