దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. అలాగే పూర్తి ధరలను అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లో కేవలం టర్బో బూస్టర్‌జెట్ బేస్ వేరియంట్ ప్రారంభ ధరను మాత్రమే వెల్లడించిన సంస్థ.. తాజాగా అన్ని వేరియంట్ల ధరలను ప్రకటించింది. కొత్త బ్రెజ్జా ధరలు రూ.7.40 లక్షల నుంచి రూ.13.70 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉన్నాయి. కాగా దీని బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.11వేలు అమౌంట్ చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.

మూడు ఇంజిన్ ఆప్షన్లు
మారుతి సుజుకి కొత్త బ్రెజ్జాను మూడు పవర్‌ట్రెయిన్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో తొలిసారిగా 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ 110.2PS పవర్, 170nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
ఈ ఇంజిన్‌తో పాటు ఇప్పటికే ఉన్న 1.5 లీటర్ K15C నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా కొనసాగుతోంది. ఇది 103PS పవర్, 139nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 6 స్పీడ్ మ్యాన్యువల్‌తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంది.
ఇంధన ఖర్చు తగ్గించుకోవాలని భావించే కస్టమర్ల కోసం S-CNG వేరియంట్‌ను కూడా కొనసాగిస్తున్నారు. ఇది 87.8PS పవర్, 121.5nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మ్యాన్వువల్ గేర్‌బాక్స్‌తో పాటు అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చారు. దీంతో బూట్ స్పేస్‌పై పెద్దగా ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది.
మైలేజీ ఎంతంటే..!
ఇంధన సామర్థ్యం విషయంలో కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ తన పాత మోడల్‌ను అధిగమించింది. 1.5 లీటర్ పెట్రోల్ మ్యాన్వువల్ వేరియంట్ 21.09kmpl మైలేజీని అందిస్తుంది.. అదే ఆటోమేటిక్ వేరియంట్ అయితే 20.17kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. టర్బో బూస్టర్ వేరియంట్ 20.47kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొంది. అలాగే సీఎన్‌జీ మోడల్ అయితే 26.90km/kg మైలేజీ వస్తుందని చెప్పింది.

లుక్, ఇంటీరియర్‌లోనే భారీ మార్పులు
ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్‌లో స్వల్ప మార్పులు మాత్రమే చేసినప్పటికీ.. ఇంటీరియర్‌లో మాత్రమే గణనీయమైన అప్‌డేట్‌లు చేశారు. కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో బయట డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. కొత్త స్మోక్ క్రోమ్ గ్రిల్, కొత్త డిజైన్ అల్లాయ్‌వీల్స్, డ్యూయల్ టోన్ క్లాడింగ్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫాస్షియా ఎస్‌యూవీకి కొత్త లుక్‌ను తీసుకొచ్చాయి.
ఇక ఇంటరీయర్ విషయానికి వస్తే 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో బిల్ట్ ఇన్ అలెక్సా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ప్రీమియం స్పీకర్లు, 64 కలర్ ఆంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాక్టివ్ కూలింగ్‌తో కూడిన వైర్‌లెస్ చార్జర్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీకి పెద్దపీట
ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రయాణికుల భద్రతకు మారుతి సుజుకీ పెద్దపీట వేసింది. భారత్ ఎన్‌సీఏపీ 5 స్టార్ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. కొత్త బ్రెజ్జాలో బ్లైండ్‌స్పాట్ వార్నింగ్, లేన్‌చేంజ్ అలర్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, ముందు-వెనుక భాగంలో పార్కింగ్ సెన్సర్లు, మెరుగైన 360 డిగ్రీల కెమెరా వంటి ఆధునాతన భద్రతా ఫీచర్లను జోడించారు.
ధర ఎంత ఉందంటే.!
టర్బో బూస్టర్‌జెట్ వేరియంట్ల ధరలు రూ.7.40 లక్షల నుంచి రూ.11.31 లక్షల వరకు ఉన్నాయి. నేచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్లు రూ.8.30 లక్షల నుంచి 13.70లక్షల వరకు ఉన్నాయి. ఇక సీఎన్‌జీ వేరియంట్ల ధరలు రూ.9.30 లక్షల నుంచి రూ.11.65 లక్షల వరకు ఉన్నాయి.
టర్బో ఇంజిన్, ఆధునాతన ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలతో వస్తున్న మారుతి బ్రెజ్జా.. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, స్కోడా కైలాక్ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.




















