పాత కంప్యూటర్‌ను కొత్తదానిలా మార్చే JioPC.. అసలేంటిది? ఎలా పనిచేస్తుందంటే!

పాత కంప్యూటర్ స్లోగా పనిచేస్తోందని కొత్త PC కొనాల్సిన అవసరం లేదు. జియో తీసుకొచ్చిన JioPC సేవతో క్లౌడ్ ద్వారా పాత కంప్యూటర్‌కు అదనపు కంప్యూటింగ్ పవర్, RAM, స్టోరేజ్‌ను పొందొచ్చు. అంతేకాదు.. ఇప్పుడు ఏ నెట్‌వర్క్ ఇంటర్నెట్ వినియోగదారైనా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. JioPC, JioPC Ultra ప్లాన్లు, ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

4 సెప్టెంబర్, 2026 7:38 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పాత కంప్యూటర్‌ను కొత్తదానిలా మార్చే JioPC.. అసలేంటిది? ఎలా పనిచేస్తుందంటే!

Social Media Image

JioPC | Septembar 04 (janavaani): కాలం గడిచే కొద్దీ కంప్యూటర్లు స్లో అవుతుంటాయి. స్టోరేజ్ నిండిపోవడం, పాత ఆపరేటింగ్ సిస్టమ్, కొత్త సాఫ్ట్‌వేర్‌లను రన్ చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయడం లేదా ఖరీదైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ చేయడం తప్పనిసరి కాదు అంటోంది జియో. ఇందుకోసం JioPC క్లౌడ్ ఆధారిత సేవను అందిస్తోంది.

ఏ నెట్‌వర్క్ వినియోగదారైనా ఉపయోగించొచ్చు

గతంలో JioPC సేవ జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ సేవను ఇతర ఇంటర్నెట్ వినియోగదారులకు కూడా విస్తరించారు. అంటే జియో సిమ్ లేదా జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తప్పనిసరి కాదు. స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా డెస్క్‌టాప్ నుంచి JioPCను ఉపయోగించుకోవచ్చు.

16GB వరకు RAM.. 1TB వరకు స్టోరేజ్

JioPCలో ప్రధాన ఆకర్షణ క్లౌడ్ కంప్యూటింగ్. కొత్త హార్డ్‌వేర్ కొనుగోలు చేయకుండానే క్లౌడ్ ద్వారా అదనపు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పొందవచ్చు. అవసరాన్ని బట్టి 16GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.

ముఖ్యంగా 3-4 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన కంప్యూటర్లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది ఉపయోగపడొచ్చు. జియో ప్రకారం, 8 ఏళ్ల పాత కంప్యూటర్‌ను కూడా JioPC ద్వారా ఆధునిక కంప్యూటింగ్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

కేవలం 5 నిమిషాల్లో యాక్టివేషన్

JioPCను ప్రారంభించేందుకు ప్రత్యేక టెక్నికల్ పరిజ్ఞానం అవసరం లేదని జియో చెబుతోంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత సుమారు 5 నిమిషాల్లో సేవను యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్త PC కొనాల్సిన అవసరం లేదు. హార్డ్‌వేర్ మార్చాల్సిన పని ఉండదు. ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు డేటా బదిలీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటికే ఉన్న PCనే ఉపయోగిస్తూ క్లౌడ్ పవర్‌ను పొందవచ్చు.

పాత PCకే AI పవర్

ప్రస్తుతం విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో AI అప్లికేషన్ల వినియోగం పెరుగుతోంది. అయితే కొన్ని AI ఆధారిత సాఫ్ట్‌వేర్‌లకు అధిక కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. JioPCలో ప్రాసెసింగ్‌లో ఎక్కువ భాగం క్లౌడ్‌లో జరుగుతుండటంతో తక్కువ సామర్థ్యం ఉన్న కంప్యూటర్లలోనూ ఆధునిక అప్లికేషన్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఇంటి వినియోగదారులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారాలకు ఇది ఉపయోగకరమైన ఆప్షన్‌గా మారొచ్చు.

JioPC ప్లాన్లు, ధరలు

జియోపీసీ రెండు రకాల ప్లాన్లను అందిస్తోంది. యూజ‌ర్లు తమ అవసరాన్ని బట్టి సాధారణ జియోపీసీ లేదా జియోపీసీ అల్ట్రా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. జియోపీసీ ప్లాన్ 8GB RAM, 500GB స్టోరేజ్. జియోపీసీ అల్ట్రా ప్లాన్ విష‌యానికొస్తే 16GB RAM, 1TB స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ధరల విషయానికి వస్తే.. రెండు నెల‌ల వ్యాలిడిటీకి జియో పీసీ రూ. 1000, జియోపీసీ అల్ట్రా రూ. 1200, ఏడాది వ్యాలిడిటీకి జియోపీసీకి రూ. 2000, జియోపీసీ అల్ట్రాకు రూ. 2500, దీర్ఘ‌కాల ప్లాన్‌కి అయితే జియో పీసీకి రూ. 4 వేలు, జియోపీసీ అల్ట్రాకు రూ. 5వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జియోపీసీ పూర్తిగా క్లౌడ్ ఆధారిత సేవ కావడంతో మంచి, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. బ్రాడ్‌బ్యాండ్ లేదా నమ్మకమైన 4G/5G ఇంటర్నెట్ ఉంటే మెరుగైన అనుభవం పొందవచ్చు.

JioPC పూర్తిగా క్లౌడ్ ఆధారిత సేవ కావడంతో వేగవంతమైన, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ కీలకం. బ్రాడ్‌బ్యాండ్ లేదా నమ్మకమైన 4G/5G కనెక్షన్ ఉంటే మెరుగైన అనుభవం పొందవచ్చు. అంటే పాత కంప్యూటర్‌లో భారీ హార్డ్‌వేర్ మార్పులు చేయకుండా క్లౌడ్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారికి JioPC ఒక ప్రత్యామ్నాయంగా నిలవొచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు