Airtel New Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. కస్టమర్లలో బాగా ఆదరణ పొందిన రూ.299 రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ తొలగించింది. దీంతో డైలీ డేటా ప్లాన్ కోరుకునే వినియోగదారులు ఇకపై అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.299తో 28 రోజుల వ్యాలిడిటీతో డైలీ 1.5GB డేటా లభించేది. ప్రస్తుతం అదే తరహా డైలీ డేటా ప్రయోజనం కోసం రూ.349 ప్లాన్‌ను ఎంచుకోవాలి. అయితే ఈ కొత్త ప్లాన్‌లో రోజుకు 2GB డేటా అందిస్తోంది. అంటే గత ధరతో పోలిస్తే రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది దాదాపు 16 శాతం ధర పెరుగుదల.
మరికొన్ని ప్లాన్లు కూడా తొలగింపు
రూ.299 ప్లాన్‌తో పాటు 30 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.319, 56 రోజుల రూ.579, 69 రోజుల రూ.619 డైలీ 1.5GB డేటా ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ తొలగించింది. అలాగే 56 రోజుల వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా అందించే రూ.649 ప్లాన్, 77 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ.799 ప్లాన్ కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఇక రూ.859 ప్లాన్ స్థానంలో రూ.899 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎంట్రీ లెవెల్‌లో ఉన్న రూ.199, రూ.219 రీఛార్జ్ ఆప్షన్లను మాత్రం కొనసాగిస్తోంది. వీటిలో రోజువారీ డేటా ఉండదు. 28 రోజుల వ్యాలిడిటీకి వరుసగా 2GB, 3GB మొత్తం డేటా లభిస్తుంది.
ARPU పెంచడమే లక్ష్యమా?
కస్టమర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) (AverageRevenue Per User) పెంచుకునేందుకు టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచడం, తక్కువ ధరలో ఉన్న పాపులర్ ప్లాన్లను తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా గతంలో ఇలాంటి మార్పులు చేశాయి. ఎయిర్‌టెల్ గతేడాది కూడా డైలీ 1GB డేటాతో 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే రూ.249 ప్లాన్‌ను తొలగించింది. ఆ తర్వాత డైలీ డేటా కోసం రూ.299 ప్లాన్‌ను కనీస ఆప్షన్‌గా ఉంచింది. ఇప్పుడు అదే రూ.299 ప్లాన్ కూడా తొలగించి రూ.349 ప్లాన్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది. ఇటీవల జూన్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ లాభం వార్షిక ప్రాతిపదికన 37 శాతం పెరిగి రూ.8,167 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం కూడా 18 శాతానికి పైగా పెరిగి రూ.58,539 కోట్లుగా నమోదైంది. రీఛార్జ్ ప్లాన్లలో తాజా మార్పులు కంపెనీ ఆదాయాన్ని మరింత పెంచే వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు.




















