మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ధరలు తగ్గే అవకాశం ఎందుకంటే?

పెరిగిన మొబైల్ రీఛార్జ్ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. టెలికాం కంపెనీలు చెల్లించే లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల భారాన్ని తగ్గించే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థల రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.

19 సెప్టెంబర్, 2026 12:58 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ధరలు తగ్గే అవకాశం ఎందుకంటే?

Recharge Price Drop : దేశవ్యాప్తంగా మొబైల్ రీఛార్జ్ ధరలు పెరగడంతో వినియోగదారులపై నెలవారీ భారం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగానికి సంబంధించిన పన్నులు, ఛార్జీలను తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. పన్నుల భారం తగ్గితే ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించే అవకాశం ఉందని టెలికాం రంగంలో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం టెలికాం కంపెనీలు తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR)పై లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నాయి. ఈ భారాన్ని తగ్గించే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

8 శాతం నుంచి 3-4 శాతానికి?

ప్రస్తుతం టెలికాం కంపెనీలపై ఉన్న సుమారు 8 శాతం భారాన్ని 3 నుంచి 4 శాతం స్థాయికి తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం, ఇంటర్నెట్ మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగించే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF)కు సంబంధించిన వసూళ్లపైనా ప్రభుత్వం సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది.

రీఛార్జ్ ధరలు ఎందుకు పెరిగాయి?

గతంలో టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను గణనీయంగా పెంచాయి. ముఖ్యంగా 28, 56, 84 రోజుల వాలిడిటీతో వచ్చే ప్రముఖ ప్లాన్ల ధరలు పెరగడంతో మొబైల్ వినియోగదారులపై అదనపు భారం పడింది. ఇప్పటికే అధిక రీఛార్జ్ ధరలపై వినియోగదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులపై ఈ భారం ఎక్కువగా ఉంటోందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రజలకు ఎంత వరకు ప్రయోజనం?

టెలికాం కంపెనీలపై పన్నులు, ఇతర ప్రభుత్వ ఛార్జీలు తగ్గితే ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ల ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు రూ.299 నెలవారీ ప్లాన్ ధర తగ్గితే ఉన్న నెలవారీ ప్లాన్ ధర 250 నుంచి 260 రూపాయలకు తగ్గొచ్చు. వార్షిక ప్లాన్లు వేసుకుంటే ప్రజలకు నేరుగా 300 నుంచి 400 రూపాయల వరకు ఆదా అవుతుంది.

అయితే రీఛార్జ్ ధరలు 10-15 శాతం తగ్గుతాయనే విషయం ప్రస్తుతం అధికారికంగా ఖరారు కాలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, టెలికాం కంపెనీలు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఎంత మేరకు బదిలీ చేస్తాయన్నదానిపై తుది ధరలు ఆధారపడి ఉంటాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు